వెంటనే గుడారాల కేసి తిరిగాడు ఒక దృఢకాయుడు! ''ఓయ్‌... సుగ్గీ... రొట్టెలు రెడీయేనా?'' అని బిగ్గరిగా అరిచాడు.
సుగ్గీ ఎవరో శ్యామ్‌సుందర్‌కి ఐడియాలేదు. అతనికే కాదు. వాళ్ళ నాయకుడికి కూడా తెలియదు కాబోలు, ''ఎవర్రా ఆ సుగ్గీ?'' ఆశ్చర్యంగా అడిగాడు....
''సుగ్గీ... సర్దార్‌... మొన్న మనం తండలో నుంచి తీసుకువచ్చిన పిల్ల.... వంట భలే చేస్తుంది. మాంసం పులుసు కాచిందంటే ప్రాణం ఎటెటో వెళ్ళిపోతుంది'' హుషారుగా చెప్పాడు ఆ దృఢకాయుడు.
''అంత చక్కగా వండుతుందా? అయితే తప్పకుండా చూడల్సిందే'' అంటూ నీటి గుంట దగ్గరికి నడిచి అవయవాల మీది దుమ్మును వదిలించుకు వచ్చాడు నాయకుడు... ఒక గుడారం ముందు ఇసుకలో బాసిపట్టు వేసుకున్నాడు.
అతనితోపాటుగా వచ్చిన అనుచరులు కూడ ఆ గుడారం ముందు కూర్చున్న తరువాత పెద్ద సత్తు పళ్లెం నిండా రొట్టెల్ని, మరింత పెద్దగా వున్న మట్టిదాక నిండుగా మాంసపు పులుసుని పెట్టుకుని బయటికి వచ్చింది ఒక యువతి. కంటికి కనిపించని చేయి ఏదో తన గుండెను పట్టుకుని బలంగా పిసికినట్టు విపరీతమైన బాధ కలిగింది శ్యామ్‌సుందర్‌కి.
అచ్చం తలమీద చేతులు పెట్టుకుని కూతురి కోసం శోకించే జానుబాయి మాదిరిగానే వున్నది ఆ పిల్ల. అదే వదనం... అదే నడక... అవే కళ్ళు... ఉన్న తేడా ఒక్క వయసు మాత్రమే.
అదే పనిగా తను కూడ ఏడుస్తున్నది కాబోలు, బండల మధ్యన శ్యామ్‌సుందర్‌కి కూడా కనిపించాయి ఎర్రబడిన ఆమె కనులు.
''ఏడుస్తున్నట్టుంది. నేను లేకుండా చూసి ఎవరయినా ఏదైనా చేశారా?'' మంద కాపలా దృఢకాయుడి కేసి చూస్తూ విసురుగా అడిగాడు నాయకుడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good