ఎక్కడో అనాగరిక దీవిలో జన్మించి దాన్ని ఫ్రాన్స్ ఆక్రమించగా తన తండ్రితోపాటు ఫ్రాన్స్ చేరి ఒక్కొక్క మెట్టూ ఎదిగి ఐరోపాను శాసించిన అద్భుత ప్రతిభాశాలి. ఎన్నో యుద్ధాలు; ఎన్నో విజయాలు, ఎన్నో పరాజయాలు తర్వాత కూడా ఫ్రెంచ్ ప్రజలకు అతడొక లెజండ్.
రాచరికమైనా, ప్రజాస్వామ్యమైనా, నియంతృత్వమైనా అది ప్రజల బాగోగులను గుర్తించకుంటే మనలేదని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి. లాటిన్ క్రీస్తురాజ్యంలో రోమ్చర్చి యొక్క ప్రాబల్యం మాత్రమే ఐరోపాను శాసిస్తున్న సమయంలో అతడు పోప్‌ని బంధించడమే కాక ''మతం వేరు రాజ్యం వేరు'' అని పరిపాలనలో మతం జోక్యం చేసుకోరాదని నిర్ధ్వందంగా ప్రకటించిన వ్యక్తి.
అతడు జీవించిన కాలంలో ఐరోపారాజ్యాలన్నీ తమకు తెలియని భూభాగాలపై ఆధిపత్యం కొరకు పోరాడాయి. అందులో ముఖ్యంగా ఇంగ్లండ్, ఫ్రాన్స్. అయితే నౌకా సైనిక శక్తి వున్న ఇంగ్లండ్, మతశక్తులు ఒకపక్క, నెపోలియన్ నియంతృత్వాన్ని భరించలేని అతని మిత్ర కూటమి కలసి అతడిని ఓడించి ఎల్బా దీవిలో బంధఙంచారు. అతడు కొత్త సైన్యంతో సముద్రందాటి మరల సైనిక శక్తి సమీకరించి వాటర్లూ వద్ద చివరి యుద్ధం చేసి ఓడిపోయి బ్రిటన్ బందీగా సెయింట్ హెలానాలో వుండి అక్కడే మరణించాడు.
ప్రచ్చన్న యుద్ధంలో ఐరోపాలో ముగిసి చివరికి ఒడంబడికలో భాగంగా అతడి ఆస్తికలు 1841లో ఫ్రాన్స్ తీసుకురాగా ప్రజలు దారి పొడుగునా హర్షధ్వానాలతో స్వాగతించి అతడిని తమ గొప్ప జాతీయ నాయకుల్లో ఒకడిగా గుర్తించడమేకాక ఆ తర్వాత జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికల్లో అతడి వారసుడు ఘన విజయం సాధించాడు. కారణం నెపోలియన్‌కు ఫ్రాన్స్‌లో వున్న గొప్ప ప్రజాదరణ మాత్రమే. చరిత్ర గమనాన్ని మలుపు తిప్పిన మహావీరుల్లో అలెగ్జాండర్, సీజర్, చెంఘిజ్ఖాన్ల సరసన చేర్చదగ్గ సాహసి నెపోలియన్.