ఆరుగొలను మా ఊరు. మా ఊరంటే మాదే. ఆరుగొలను మా నండూరి వారి మొఖాసా. మొఖాసా అంటే నాకు బాగా తెలియదు గాని - మా పూర్వీకులకి ఏ నవాబో రాజో జమీందారో ఇనాముగా ఇచ్చిన గ్రామం. మొదట్లో ఆరు గొలనులో అందరూ నండూరి వారే ఉండేవారు - రెండు మూడు కుటుంబాల వారు తప్ప. అంచేత ఊరిలో ఎటు వెళ్ళినా ఏ వీధిలోకి వెళ్ళినా నండూరి వారే. తాతయ్యలు, బాబాయిలు, బామ్మలు, అత్తయ్యలు, అన్నయ్యలు, పిన్నులు - అందరూ నండూరి వారే.

    ఆరుగొలనులో ఆరు పెద్ద కొలనులు - చెరువులు ఉండేవిట. అందుకే ఆ పేరు. నాకు తెలిసి - మా యింటికెదురుగా ఉన్న పెద్ద చెరువు. పక్కనే చాకలి చెరువు. కొంచెం దూరంలో పొలాల్లో ఇంకో చెరువు ఉండేవి.

    చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లోనూ మా ఊరే పెద్ద ఊరు. మెయిన్‌ రోడ్డు మీద ఉన్న ఊరు. కృష్ణా జిల్లాలో గుడివాడ నుంచి నూజివీడు వెళ్ళే రూటులో గుడివాడకి తొమ్మిది మైళ్ళ దూరంలోనూ, అటు నుంచి హనుమాన్‌ జంక్షన్‌కి అయిదు మైళ్ళ దూరంలోనూ ఉంటుంది. చిరివాడ, లింగాల, పుట్టగుంట, తిప్పనగుంట, పెరికీడు, ఓగిరాల, ఆరుగొలనుకు చుట్టూ ఉన్న పల్లెటూళ్ళు. తిప్పనగుంటనే మొవ్వారిగూడెం అనే వాళ్ళు. ఆ ఊరంతా మొవ్వవారే.

    ఆ పల్లెటూళ్ళలో ఆరుగొలనే పెద్ద ఊరు గాని మరీ పెద్ద ఊరేం కాదు. మా చిన్నప్పుడు హైస్కూలు కూడా లేదు. వీధి బళ్ళు రెండో మూడో ఉండేవి. నేను చదువుకున్నది నారాయణం బాబాయి వీధిబడి. వెంట్రప్రగడ కుటుంబరావు గారి బడి ఉండేది. రామచంద్రయ్య తాతయ్య బడి ఉండేదిట.

    అయిదో తరగతి దాకా వీధిబళ్ళో చదువుకుని, తర్వాత ఎంట్రన్సు రాసి హైస్కూలులో ఫస్టు ఫారంలో చేరేవాళ్ళు. నేను ఫస్టు ఫారంలోకి వచ్చినప్పుడే ఊళ్ళో కొత్తగా హైస్కూలు పెట్టారు. అంతకు మునుపు అయితే ఫస్టు ఫారంనించీ కూడా బయట ఊళ్ళకెళ్ళి చదువుకోవాల్సిందే. చుట్టూ పచ్చటి పొలాలు. వ్యవసాయం ముఖ్య వృత్తి.....

Write a review

Note: HTML is not translated!
Bad           Good