హైదరాబాదు సాంస్కృతిక చిహ్నంగా 'చార్మీనార్ ' నిలబడితే, కథకుడు నెల్లూరి కేశవస్వామి కథల సంపుటి 'చార్మీనార్ ' కూడా అలాగే నిలబడింది. ఇందులో హైదరాబాదు తెలుగుభాష ఒక మీనార్, సంస్కృతి ఒక మీనార్, రాజకీయ నేపథ్యం ఒక మీనార్ అయితే, సామాజికాంశాలు మరో మీనార్. ఈ విధంగా నాలుగు మీనార్‌లతో కూడిందే నెల్లూరి కేశవ స్వామి కథా సర్వస్వం.

చార్మీనార్ - ఒక గొప్ప ఫ్యూడల్ రాచరికపు చిహ్నంగా తలెత్తుకు నిలబడింది నిజమే కానీ కేశవస్వామి దాన్ని ఉన్నదున్నట్లుగా శ్లాఘించలేదు. ఆ వ్యవస్థలోని అవలక్షణాల్ని ఈసడిస్తూనే మనుషులుగా హిందూ ముస్లింల స్నేహాన్ని ఆకాంక్షించారు. మానవీయ విలువలకు ప్రాణం పోశారు. ఓ చారిత్రక నేపథ్యాన్ని, ఒక సాంస్కృతిక నేపథ్యాన్ని తన కథల్లో నిక్షిప్తం చేస్తూనే ఒక మహారచయిత ఎదగాల్సిన స్థాయికి ఎదిగారు నెల్లూరి కేశవస్వామి. కాని ఎందువల్లనో ఆయన కథలపై జరగాల్సినంత చర్చ జరుగలేదు. ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదేమోనని అనిపిస్తుంది. ఆయన కథలు చదువుతూ ఉంటే సాలార్‌జంగ్ మ్యూజియంలో గత వైభవ చిహ్నాల్ని చూసి తబ్బిబ్బయినట్లు ఉంటుంది. 'ఇది ఒకప్పటి మన జాతి జీవితమే కదా' అని గర్వంగా కూడా ఉంటుంది. హైదరాబాదులోని ఇన్ని సాంస్కృతిక వైరుధ్యాలు ఇంత ప్రతిభావంతంగా మరే తెలుగు రచయిత తమ కథల్లో వ్యక్తీకరించలేదని అంటే అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good