తల్లి తనకొడుకు గదిలోకి వెళ్ళింది. 'స్కూలుకు వెళ్ళాల్సిన టైమైంది కుమార్' అన్నది.
దుప్పటి ముసుగును తల మీదికి మరి కాస్త లాక్కున్నాడు కుమార్. 'నాకు స్కూలుకు వెళ్ళాలని లేదు'.
'వెళ్ళక తప్పదు' అన్నది తల్లి.
'నాకు వెళ్ళాలని లేదంటూ వుంటే. నేనంటే ఆ టీచర్లకిష్టం లేదు. ఇక పిల్లలందరూ నన్ను వెక్కిరించేవాళ్ళే.
తల్లి కుమార్ కప్పుకోనున్న దుప్పటిని లాగేసింది. 'కుమార్, ఇది నీ ఇష్టం మీద ఆధారపడిన విషయం కాదు. నువు స్కూలుకు వెళ్ళక తప్పదు'.
'ఎందుకు వెళ్ళాలిట? ఎందుకు వెళ్ళాలో నువు చెప్పు, చూద్దాం' అన్నాడు కుమార్.
'కుమార్, నువు నాలభై ఐదేళ్ళ వాడివి; స్కూలు హెడ్ మాస్టర్వి'.
ఇదీ, మన పరిస్థితి అంటాడు మార్క్ గాఫ్నీ. అసలు నిద్ర లేవాలనే ఉండదు. ఎంతకాలంగానో ఈ నిద్ర!
'నీయందే కలదోయి'
మనిషిని తరింపచేసేదేదో మనిషిలోనే వుందని అంటారు తెలిసినవారు. కానీ ఈ మాటని విన్నవారెవరూ ఇది నిజమని విశ్వసించరు. ఇదేదో చమత్కారంగా తెలివిగా అనే మాటేకానీ, అంత నమ్మదగిన మాటగా భావించరు. ''ఇది నిజమే అయితే ఈ దేవాలయాలన్నీ ఎందుకు వెలిసినట్లు, ఈ తీర్థయాత్రలు ఎందుకు నిర్దేశించినట్లు, ఈ పూజలు పునస్కారాలు, ఈ యజ్ఞాలు యాగాలు ఇవన్నీ ఎందుకు? ఇతర మతాలను పరిశీలించినా అదే గతి. ఆ మసీదులు, చర్చీలు, గురుద్వారాలు, బౌద్ధారామాలు అక్కడ ఏదో ఒక రూపంలో జరిగే పూజలు, ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు? కనుక్కోదగింది తనలోనే వుంటే బాహ్యంగా ఈ వెతుకులాటంతా ఎందుకు? వీరంతా వెర్రులై వెతుకుతున్నారా? అని తోసి పుచ్చుతాడే కానీ, తనలోనికి తాను ప్రవేశించమని చెప్పిన వారి మాట నిజమా కాదా అనే పరిశోధనకు పూనుకోడు. ఆ పూనికకు ఎంతో సాధన కావలసుంటుంది. ఈ శ్రమంతా ఎవడు పడతాడు? దైవాన్వేషణ కోసమై సుఖాన్వేషణనెవరు వదులుకుంటారు. ధనాన్వేషణ, సుఖాన్వేషణకైతే ఎంత శ్రమకైనా ఓరుస్తాడు కాని దైవాన్వేషణ ప్రసక్తి వస్తే ఎంతో నీరసించిపోతాడు. సాధనతో నిమిత్తం లేని బాహ్యాడంబరపూజలతో సరిపెట్టుకొని జీవితం వెళ్ళదోస్తాడు.
''నీ హృదయాన్ని తెఱచిచూడు. మానవ చరిత్ర యావత్తూ ఆ హృదయంలోనే లిఖించబడివుంది. ఓపికతో పరిశీలించేట్లయితే మానవాళి సుఖదు:ఖాలన్నీ కనుగొనే వీలుంది'' అంటారు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి. నిన్ను నీవు కనుగొంటే ఇదంతా అర్థమయినట్లే. దైవం వేరే ఎక్కడో లేడు. అనేక చోట్ల వెతికి విసిగి వేసారిన తర్వాత నీలోనే ఉన్నాడని కనుగొన్నప్పుడు నీ ఆశ్చర్యానికి మేర ఉండదు'' అని మహామహులు మొదట్నించీ చెప్తూనే వున్నారు....
''నీయందే కలదోయి నిశ్చలపు చూపులో ఎల్ల వేదములకు ఎల్లయగు తొలి వెలుగు'' అనే శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులవారి గీతంలో ఎంతో సత్యం తొణికిసలాడుతుంటుంది.