1975వ సంవత్సరం తర్వాత వచ్చిన స్త్రీవాద భావాలు అనేకమంది మేధావులను, వామపక్ష, ప్రగతి శీలురనుకునే వారిని కూడా కలవరపెట్టాయి, కల్లోల పరచాయి...80వ దశాబ్దంలో రచయిత్రులు ఈ అంశాల గురించి విరివిగా రాయటం ప్రారంభించారు. ఆ కాలంలో ఈ విషయాల గురించి చిత్తశుద్ధితో, సహానుభూతితో ఆలోచించి అర్థం చేసుకుని కథలు రాసిన రచయితగా సింగమనేని గారిని చెప్పుకోవచ్చు...

మధ్యతరగతి కుటుంబాలలో స్త్రీలు పడే హింసను, వరకట్నమనే దుర్మార్గానికి తల ఒగ్గాల్సిన స్థితిలో ఉన్న స్త్రీలను, కొత్త సామాజిక నేపథ్యంలో ధైర్య సాహసాలతో, వివేకంతో ఎదుగుతున్న స్త్రీలను సింగమనేని ఒక పితృవాత్సల్యంంతో, మిత్ర సాన్నిహిత్యంతో తన కథలలో పాత్రలుగా మలిచారు.

స్త్రీల చైతన్యంతో రగిలే దశాబ్దంలో కొన్ని కథలే అయినా కీలకమైన అంశాల గురించి మంచి సాహసులైన పాత్రలను సృష్టించి కథలు రాయటంతో తన మార్క్సిస్టు దృక్పథాన్ని విశాలం చేసుకున్న సృజనాత్మక రచయితగా నిలిచారు సింగమనేని నారాయణగారు. సమాజంలో స్త్రీల పట్ల రావలసిన సంస్కార దృష్టిని పరిచయం చేసిన రచయితగా సింగమనేనిగారు గుర్తుంటారు.

- ఓల్గా

Write a review

Note: HTML is not translated!
Bad           Good