భారత ఇతిహాసంతో ఉన్న పోలికల కారణంగా 'పల్నాటి వీరచరిత్ర' - తెలుగునాట మహాభారత గాథ స్ధాయి ప్రాచుర్యం పొందిందని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. నాగమ్మ మంత్రాంగం నెరపిన నలగామరాజు పక్షాన్ని కౌరవులతో, బ్రహ్మనాయుడు మంత్రిగా ఉన్న మలిదేవాదుల పక్షాన్ని పాండవులతో పోల్చడం ఎప్పటినుంచో ఉన్నదే. పల్నాడు చీలికకు, యుద్ధానికి, పర్యవసనానాలకు కారకురాలిగా నాగమ్మనే బోనెక్కించారు, ప్రతినాయకురాలిగా చిత్రించారు, దోషిగా తీర్పునిచ్చారు చరిత్రకారులు. నిజానికి - నాగమ్మ నాయకురాలని, బ్రహ్మనాయుడే ప్రతి నాయకుడని రచయిత శ్రీ వై.హెచ్‌.కె.మోహన్‌రావు ప్రగాఢ విశ్వాసం. అంతమాత్రాన ఆయనను నాగమ్మ పక్షపాతిగానో, చరిత్రను వక్రీకరిస్తున్న వారిగానో భావించనక్కర లేదు. దాదాపు వెయ్యేళ్ళక్రితం మహిళల్ని వంటింటికే పరిమితం చేసి, పురుష సమాజం ఆధిపత్యాన్ని, అధికారాన్ని చలాయిస్తున్న రోజుల్లోనే - తన మేథోసంపదతో, కార్యనిర్వాహణాదక్షతతో రాజాదరణను చూరగొన్న ధీశాలి ఆమె. 'మహామంత్రిణి'గా వాసికెక్కిన ఓ మహిళకు, ఓ నాయకురాలికి చరిత్రలో అన్యాయం జరిగిందన్న మోహన్‌రావుగారి ధర్మాగ్రహం అక్షరరూపం ఆల్చడం ఆయన సహృదయ సంస్కారానికి నిదర్శనం. వీరపూజ, వ్యక్తి ఆరాధన, పక్షపాత పూరిత రాగద్వేషాల ప్రదర్శన - కొందరు నాయకుల్ని ఆకాశానికెత్తి నిలువెత్తున నిలబెట్టడానికి, మరికొంతమందిని ఆగాధల్లోకి తోసి వ్యక్తిత్వహననానికి ఏవిధంగా బాటలు పరిచిందీ ఆయన తన రచన 'తొలి మహామంత్రిణి నాయకురాలు నాగమ్మ'లో సోదాహరణంగా వివరించారు. అన్నదమ్ముల మధ్య రాజ్య విభాగాలు, కోడి పందాలు, అలరాజు హత్య, చాపకూడు, బ్రహ్మనాయుని ఒరుగు - ఇలా పలు ఉదంతాల్లోని చీకటి కోణాల్ని వెలుగులోకి తెచ్చారు. దేశీయ, విదేశీయ చరిత్రకారులతోపాటు, శాసనాలు, సాహిత్యం, జానపద గాథలు వంటి వాటినుంచి సమాచారాన్ని విస్తృతంగా సేకరించారు. నిష్పాక్షికంగా విశ్లేషించారు. 'దాచేస్తే దాగని సత్యాలివీ' అంటూ - తాను నమ్ముతున్న విశ్వాసాల్ని నిర్మొహమాటంగా ఆవిష్కరించారు. సమాజంలో బలంగా నాటుకుపోయిన నమ్మకాలను (ముఖ్యంగా బ్రహ్మనాయుడు, నాగమ్మ వంటి చారిత్రక వ్యక్తుల విషయంలో) ప్రశ్నించడమంటే ఏటికి ఎదురీదడమే. ఆ సాహసానికి పూనుకున్న మిత్రులు మోహన్‌రావుగారు అభినందనీయులు. నాయకురాలి గుణగణాలను నిర్మమకారంగా, నిష్పాక్షికంగా పునర్మూల్యాంకనం చేసి చారిత్రక కోణంలో ఆమె వ్యక్తిత్వాన్ని, ధీరత్వాన్ని, రాజనీతి చాతుర్యాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరించే ఈ పుస్తకం అవశ్యపఠనీయం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good