ఈ తరహా సంకలనాలు కేవలం అమెరికా, ఫ్రెంచ్సమాజంలో మాత్రమే చూస్తాం. ఇందువల్ల రచయిత వ్యక్తిగత జీవితం బాగా తెలిస్తే వారి కథలను బాగా అవగతం చేసుకునే వెసులు బాటు పాఠకునికి కలుగుతుంది. ప్రసిద్ధ రచయిత చెకొవ్గురించి మాక్సిమ్గోర్కి రాసిన వ్యక్తిత్వ చిత్రణ చాలా గొప్పది. ఆయనను అర్థం చేసుకునేందుకు ఎంతగానో ఉపకరించే రచనది. కొందరు రచయితల ఇంటర్వ్యూలు ఆస్థాయిలో ఉండడం విశేషం. చిలుకూరి దేవపుత్ర, నారాయణస్వామి, బిఎస్రాములు తమ బతుకుతీరుగురించి చాలా నిజాయితీగా చెప్పుకున్నారు.
తెలుగు కథ ఒక చారిత్రిక దశకు చేరుకున్నదనే చెప్పాలి, ముందెన్నడు చూడని పరిణామాలను చవి చూడడమే గాక అనేక మలుపులు తిరిగింది. అనేక ప్రయోగరీతులను చవిచూసింది. విభిన్న జీవితాలను ఎవరూ రాయలేని కోణాలను కూడా వెలుగులోకి తెచ్చింది. ఎన్నడు ఊహించని, సాహిత్యరంగంతో ఏమాత్రం పరిచయం లేని వర్గాలనుంచి వారి జీవితాల మీద కూడ అనేక కథలు వస్తున్న కాలమిది.ఈనేపథ్యంలో వెలువడిన గ్రంథమే నవ్యనిరాజనం 50 కథలు, కథకుల అంతరంగాలు.ఉత్తమ సాహిత్యానికి పేరెన్నిక గన్న నవ్యవీక్లీలో వచ్చిన యాభైమంది కథకుల ఇంటర్వ్యూలు వారు వెలువరించిన కథల సమాహారమే ఈ సంకలనం.