మాలతీ చందూర్ నవలా సాహిత్యమంతా చదివి ఏమిటీవిడ నవలల సారాంశం? మాలతీ చందూర్ ఈ నవలల ద్వారా ఏ సాహిత్య ప్రయోజనాన్ని ఆశించారు? ఏ ముఖ్యాంశాలను చర్చకు పెట్టారు? పాఠకులకు ఎలాంటి చూపును అందించదల్చుకున్నారు అని ప్రశ్నించుకుంటే మనకు అనేక విషయాలు అర్థమవుతాయి. ఆమె రాసిన నవలలన్నిటిలో వాస్తవ జీవితం, ఆధునిక దృష్టి, పాత సంప్రదాయాల నిరసన, కొత్త దారులలో నడిచే వారి జీవితాలలో వచ్చే సమస్యల పట్ల సానుభూతి, స్త్రీల సమస్యలను ఆధునిక దృష్టితో పరిశీలించడం, కుటుంబ సంబంధాలలో దోపిడి, ఇరుకుతనాలను ప్రశ్నించడం, వివిధ జీవన సందర్భాలలో చిక్కుకున్న పాత్రల మానసిక విశ్లేషణ, ఇలా యెన్నో అంశాలు మన దృష్టికి మనం పెద్దగా కష్టపడకుండానే కనిపిస్తాయి. ఇంకొంచెం లోతుకు వెళ్ళి చూస్తే ఆమె నవలలన్నిటినీ ఆవరించి ఒక పునాదిలా వుండిన సామాన్యమైన అంశం ఒకటుంది. అది స్త్రీలపై సమాజంలో రకరాకాల రూపాలలో జరిగే హింస. రెండు మూడు నవలలు దీనికి మినహాయింపు కావచ్చు గానీ తక్కిన నవలలన్నింటిలో అతి విషాదకరమూ, అనంతమూ అయిన స్త్రీలపై హింసను దాని వాస్తవ రూపంలో మనకు చూపించారు మాలతీ చందూర్. - ఓల్గా |