ఆంధ్రదేశం గర్వించదగిన సాహితీపరులలో ఎన్నిక చేయవలసిన ఓ మహాకవి తన ఒకే ఒక్క కొడుకుని చదువుకోడానికి బడికి ఎందుకు పంపించలేదో మనస్తత్వ శాస్త్రవేత్తలు తేల్చవలసిన విషయం. ఏ వ్యక్తి కథా తన తండ్రి ప్రాధాన్యం లేనిదే సంపూర్ణం కాదు. ఇక ఆ తండ్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి అయితే ఇక చెప్పవలసిన దేముంది?

'నాన్న-నేను' అనే ఈ స్వీయ కథ దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రిది. మరోవిధంగా చెప్పాలంటే దేశంలో కార్టూన్‌ ప్రేమికులందరికీ లబ్దప్రతిష్ఠులైన బుజ్జాయిది. ఈ అనూహ్యమైన కథలో బుజ్జాయి వాల్‌ పోస్టర్లు చూసి అక్షరాలు ఎలా నేర్చుకున్నాడో, తన పదిహేడవ యేటనే మొదటి బొమ్మల పుస్తకాన్ని ఎలా ప్రచురించారో, ఆ తరం మేరు దిగ్గజాలన తగ్గ సాహితీ పరులతో ఎలా భుజాలు రాసుకొంటూ తిరిగారో, తన తండ్రిని నీడలాగ వెంబడిస్తూనే తన కార్టూన్లతో తన ధోరణిలో ఎలా జాతీయ స్ధాయి కీర్తి ప్రతిష్ఠల నార్జించారో తెలియజేశారు.

చదువంటే బడిలో, గురువు ముఖత సాధించే విద్య అని తెలియని ఒక వ్యక్తి చెప్పిన కథగా, గడచిన తరం వైభవాన్ని తన నీడలాగ వెంబడించిన ఒక అదృష్టవంతుని జీవితంగా ఊపిరి తిరగనీయకుండా చదివించే ఇతివృత్తమిది. ఒకనాటి ఆంధ్రదేశపు ఔన్నత్యాన్ని ఒరుసుకు సాగిన ఒక విచిత్రమైన, విభిన్నమైన బుజ్జాయి కథ-ప్రతి పేజీలోనూ మిమ్మల్ని మిరుమిట్లు గొలుపుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good