ఈ భూమండలం మీది సకల వివక్షలకూ పరాకాష్ట ఇది! అసలే నల్లజాతి. ఆపై మహిళ. దానికితోడు బానిస వ్యవస్థలో బతుకు అనుక్షణం బండలైపోతున్న ఓ నిరక్షరాస్యురాలి నుంచి ఎవరైనా ఏం ఆశించగలరు? కానీ ఆమె ఓ అసాధారణ శక్తిమంతురాలు. ఏ వివక్షా ఆమెను ఆపలేదు. పైగా తనపైనా, తను ప్రాతినిథ్యం వహించే నానారకాల పీడిత సమూహాలపైనా అమలవుతున్న వివక్షలను బద్దలు కొట్టటమే లక్ష్యంగా ఎంచుకొని అధమాధమ స్థాయి నుంచే అసాధారణ పోరాటం సాగించి - నిరంతరం నిప్పు కణికలా జ్వలించి - ఆ వెలుగులో ప్రపంచానికి కొత్త వెలుతురు పంచిన మహిళ కథే ఈ పుస్తకం. కంట తడిపెట్టించే ఆర్తి, ఉద్వేగాన్ని రగిల్చే స్ఫూర్తి - రెండూ ఈమె జీవితం నిండా పరుచుకున్నాయి.

    నల్లజాతిలో పుట్టిన రత్నాలు, వారి జీవిత కథలు ఈ ప్రపంచానికి రుచిచూపించిన, నేర్పించిన అనుభవాల పరంపర ఎంత గాఢమైందో, ఎంత సాంద్రమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నల్లజాతి బానిస మహిళగా పుట్టిన ట్రూత్‌ సాగించిన ఈ యుద్ధం బానిసత్వ నిర్మూలనతో ఆగలేదు. ఇది చాలా విస్తృతమైంది. తొలితరం స్త్రీ హక్కుల ఉద్యమకారిణిగా, జైళ్ళ సంస్కరణల నుంచి, ఆస్తి హక్కుల నుంచి, ఓటు హక్కుల వరకూ నేటి ఆధునిక రాజకీయ వ్యవస్థల మీదా, పోరాట రూపాల మీదా ఆమె ముద్ర బలంగా ఉంది. అందుకే ప్రపంచం ఇప్పుడు ట్రూత్‌ జీవితాన్ని కథలు కథలుగా చెప్పుకుంటోంది. ఆమె జీవితంపై పాటలు, సినిమాలు, నాటకాలు, పిల్లల పుస్తకాలు, పాఠ్యాంశాలు అసంఖ్యాకంగా వచ్చాయెందుకో ఈ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good