నాటకం అంటే వేషాలా ?

కొత్తసృష్టికి కొత్త విమర్శన కూడా కావాలి.

నిన్న రాత్రి ఒక కొత్త నాటకం చూశాను.

దాని మీద అనేక దృక్పథాలనుంచి చూసే విమర్శనకు నమూనా యీ వ్యాసం.

మొట్టమొదట కొన్ని వివరాలు, వీటిని ఒక వార్తా పత్రిక 'రిపోర్టు' చేసే విధంగా వెల్లడిస్తాను.

ముందడుగు నాటక ప్రస్థానం

బెజవాడ, అక్టోబరు 4, నిన్న రాత్రి దుర్గాకళామందిరంలో ఆంధ్రప్రజానాట్యమండలి (కృష్ణాదళంవారు) 'ముందడుగు'' అనే సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. నాటకశాల జనంతో క్రిక్కిరిసి పోయింది. సభనలంకరించినవారిలో డాక్టరు అచ్చమాంబ, శ్రీరాయప్రోలు సుబ్బారావు, శ్రీశ్రీ మొదలైన ప్రముఖులున్నారు. రంగస్థల మర్యాదలను కట్టుదిట్టంతో పోషించడంలో అభినేతలూ, నాటకాన్ని సావధానంగా విని హర్షించడంలో ప్రేక్షకులూ చాలా వరకు కృతకృత్యులైనారు. ఈనాడు ప్రయోగిస్తున్న నాటకాలలో ఇదొక కొత్త పంథా తొక్కిందనీ, నిజంగా నేటి రంగస్థలంలో ఇదొక పెద్ద ముందంజ వేసిందనీ, అనేక ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

సానుభూతితో వార్తను ప్రకటించే ఒక బూర్జువా పత్రిక ఏ విధంగా రిపోర్టు చేస్తుందో చెప్పడానికి పై పద్ధతిని నేనవలంబించాను. కాని అంతటితో వాస్తవికత పూర్తిగా రికార్డు చెయ్యడం అయిపోయినట్టేనా?

ఒక నాటకం స్టేజిమీద ఆడుతున్నప్పుడు అదే సమయంలో ఇంకో రెడు నాటకాలు (ఒకటి నేపథ్యంలో, ఇంకొకటి ప్రేక్షకులలో) జరుగుతూ ఉంటాయి. ఈ మూడు యే అపశ్రుతులూ లేకుండా ఒక్క లయకు పెనచుకున్నప్పుడే నాటకం రక్తి కట్టిందంటాము.

ఏకకాలంలో జరిగే ఈ మూడు నాటకాలను ఎంత గొప్ప రిపోర్టరయినప్పటికీ సమగ్రంగా ఒక్కడే రికార్డు చెయ్యలేడు. నాట్యరంగం కోసమని ప్రత్యేకంగా ఒక పత్రిక వుండి, అది వైజ్ఞానిక పద్థతుల మీద నడుస్తువుంటే -- అందులో నాటకం ప్రారంభమయింది లగాయతు అంతమయ్యేదాకా జరిగిందంతా వేర్వేరు కోర్టులనుంచి కనిపెట్టిన వేర్వేరు వ్యక్తులు తమ రిపోర్టులు ప్రకటించవచ్చు.

అయినా అదేం చిత్రమోకాని అంతలోనైనా ఆగిపోదు వాస్తవికత.

నాటకం ముగిసిన తర్వాత అది ప్రేక్షకలోకంలోంచి బైటికి వెళ్ళిపోయి పుట్టించే తరంగాలు, సృష్టించే పరివర్తనం --

1. నేపథ్యంలో నాటకం : కవి నాటకం రాస్తాడు. పాత్రలు తమ తమ భాగాలు తీసుకొని చదువుకుంటారు. ప్రయోక్త అన్ని హంగులూ సరిచూచుకుంటాడు. పాత్రలను సింగారం చేసే వాడి దగ్గరనుంచి తెర ఎత్తేవాడిదాకా, అందరూ హుషారుగా ఉంటారు. నేపథ్యంగా ఒక ప్రపంచం.

2. రంగస్థలం మీద : నాటకం ఒక సమూహ ప్రయత్నం. ఏ ఒక్క నటుడూ ఇంకొకడి ప్రాముఖ్యాన్ని అపహరించకూడదు. ఒక జీవిత ఖండికను కాల, దేశ, ఉభయా వరణలలో నిలబెట్టి ప్రదర్శించేది నాటకం.

3. ప్రేక్షకులలో : చతురస్రాకృతిలో ఉన్న నాటకశాలవల్ల ముందు వరుసల వారు (అనగా ధనిక తరగతులవారు) యెక్కువ రసానుభూతి పొందటానికి వీలవుతుంది. డబ్బులేని వాడు వెనక్కి పోవడం పెట్టుబడిదారీ విధానపు లక్షణం.

ధనస్వామ్య వ్యవస్థ పరిణతి పొంది పొంది నేటి రంగస్థలం మీద కూడా తన ప్రభావాన్ని ముద్రించింది. రాబోయే సామ్యవాద వ్యవస్థలో రంగస్థలం గోళాకారం వహించబోతుంది. ఎక్కడ కూర్చున్నా ఒక్కలాగే నాటకం - అదీ అందుకోవలసిన ఆశయం.

పేజీలు :47

Write a review

Note: HTML is not translated!
Bad           Good