నా ప్రేయసిని పట్టిస్తే కోటి
అతని పేరు పీతాంబరం,
మధ్య వయస్కుడు,
పేరుకు తగ్గట్టే తెల్లటి ఫాంటు షర్టులో కాస్త గంభీరంగాను, కాస్త హడావుడిగాను కన్పిస్తున్నాడు. జనాబా లెక్కల సేకరణలో భాగంగా గేటు తీసుకొని ఓ దాబా ఇంటిముందుకెళ్ళాడు.
చెన్నై ఎయిర్‌పోర్టుకు కాస్త దూరంలో సువిశాలమైన కాలనీ ఒకటి వుంది. ఆ కాలనీ పేరు గోస్వామి కాలనీ, మూడే మూడు వీధుల కాలనీ అది.
ఆ కాలనీలో అనర్నీ ఒకేలా ఫారెన్ స్టయిల్లో నిర్మించిన విల్లాలున్నాయి. మూడు వరుసల్లో మొత్తం నూట ఎనభై గృహాలు ఒక్కో వరుసలోను అరవై యిళ్ళు. యిళ్ళముందు రోడ్డు మొత్తం మూడు రోడ్లు. ఆ కాలనీని చుట్టి కాంపౌండ్‌వాల్ ఉంది. దానికి దక్షిణ భాగాన ఒకే ఎంట్రన్స్. ఇళ్ళన్నీ తూర్పు ఫేసు. గేటు దాటగానే ఎవరికి వాళ్ళు అవతలికి వెళ్ళి పోవచ్చు. చాలా ఖరీదైన ఏరియా. గోస్వామి కాలనీ అంటే ఆ ప్రాంతంలో తెలీని వాళ్ళుండరు. గోస్వామి రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కట్టి అమ్మిన కాలనీయిళ్ళవి. అటువంటి కాలనీలోని..ఏరియాకు వచ్చిన పీతాంబరం 'ఎ' వరుసలోని మొదటి రెండు ఇళ్ళు చూసుకొని మూడో ఇంటికొచ్చాడు. తలుపు దగ్గరగా మూసి ఉంది.
''ఎవరండీ ఇంట్లో'' బయట చిన్న అరుగు మీద చతికిల బడుతూ పిలిచాడు.
ఎవరూ పలకలేదు.
'ఎవరండీ లోపల? మాట్లాడరా?'' ఈ సారి కాస్త విసుగు ధ్వనించింది పీతాంబరం గొంతులో. అప్పుడు లోపల్నుంచి - ''మీరెవరండీ?'' అంటూ ఒక యువతి గొంతు మృదువుగా విన్పించింది.
''అమ్మా నా పేరు పీతాంబరం..''
''ఏ తాంబరం?''
''తాంబరంకాదు తల్లీ, పీతాంబరం, జనాభా లెక్కలు సేకరించే డ్యూటీలో వచ్చాను. మీ యింట్లో ఎంత మంది ఉంటున్నారు? పురుషులందరు, స్త్రీలెందరు, పిల్లలెందరు. మీ పేర్లు, వయస్సు టకటక చెబితే రాసుకువెళ్ళిపోతాను. అంటూ పుస్తకం తెరిచాడు.....