ఒక అపప్రథ ఉంది. శాస్త్రబద్ధమైన కళలే గొప్పవి; తక్కినవి కావు, అని. అది నిజం కాదు. ప్రతి శాస్త్రీయ కళావృక్షం వెనుకా జానపద బీజం ఉంది. జానపదులు ఆలవోకగా, ఒకరి కోసం కాక తమకోసమే ఆచరించే వినోద మార్గాలు, విజ్ఞానపథాలు అన్ని శాస్త్రీయ కళలకూ పునాదులు. ఈనాడు మనం జ్ఞానఖనులనుకొంటున్న సంగీత భరతాలు, వ్యాకరణాలంకారాలూ, ఒకటేమిటి అన్ని శాస్త్రాలూ ఆనాటి ఆదిమ మానవుల వంటకాలకు తదుపరి మేధావులద్దిన రంగూ రుచీ. కాలానుగుణ్యంగా యీ పచన పద్ధతులు మారుతూ ఉంటాయి. వండేవారూ వడ్డించేవారు నలభీమ సమానులైతే ఆ మార్పులు ఆ కళావ్యాసంగాలకు చేర్పులవుతాయి. సమకాలీన సమాజాన్ని పరవశింపజేస్తాయి.
హనుమచ్ఛాస్త్రిగారు మేరు శిఖరాలుగా గుర్తించినవారు 19, 20 శతాబ్దంలో పుట్టినవారే. కొందరు తమ నైపుణ్యాల నిగ్గుని మనకు వదలి, దివికేగిన వారయితే మిగతావారు మనలో యిప్పటికీ ఉండి, యాంత్రిక జీవన ఊసర క్షేత్రాలపై దేవామృత వర్షం కురిపిస్తున్నవారు. సస్యశ్యామలం చేస్తున్నవారు.
వీరందరి గురించి ఎవరో, ఎక్కడో, ఎప్పుడో వ్రాశారు. కాని యీ మహనీయుల జీవితాలు ఒక పుస్తక రూపంలో, సాంకేతిక జటిలత్వం జోలికి పోక సులభగ్రాహ్యమైన శైలిలో రావడం చాలాగొప్ప విషయం. కళాతపస్వులను సర్వులకూ దగ్గరచేసే దుర్భిణీ యంత్రం. హనుమచ్ఛాస్త్రిగారిని ఇంతటిలో ఆగనివ్వకుమని ఆ సరస్వతిని ప్రార్థిస్తున్నాను. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good