ఆంగ్లేయుల బానిస సంకెళ్ళనుంచి మనదేశం విముక్తి కాకముందు నుంచి నేటి స్త్రీ దళిత బహుజన గిరిజన మైనారిటీ వాదాల వరకు, నాటకరంగం మొదలుకొని మూకీ టాకీల నుంచి నేటి ఐ మాక్స్‌ల వరకు, ఏతాలు, గూడలు, కపిలలు, ఎడ్లబండ్లు మొదలు కార్లు విమానాలు ఉపగ్రహాల వరకు, గ్రామ ఫోను రికార్డులు, టేప్‌ రికార్డులూ, సీడీలు మొదలుకొని నేటి అతర్జాలం వరకు ఒక ప్రవాహంలో వచ్చిన మార్పులకు ప్రత్యక్షసాక్షిగా నేటికీ కలం వదలని అరుదైన కథకుడు మునిపల్లె రాజు.

సోషల్‌ రియాలిటీ సోషల్‌ ఫిలాసఫీ మొదలుకొని మేజిక్‌ రియలిజమ్‌ వరకు, మార్క్సిస్టు భావజాలం దగ్గర నుంచి మానవ జీవితాలను శాసించే సూత్రాల వరకు అన్నింటినీ తన కథలలో ప్రతిభావంతంగా ప్రయోగించి మెప్పించిన ఏకైక కథారచయిత మునిపల్లె రాజు.

వీరి కథా కథనం గంభీరంగా ప్రవహించే గంగా ప్రవాహంలా జీవిత పార్శ్వాలను స్పృశిస్తూ పాఠకుల్ని కథాకాలం నుంచి సమాజంలోకి లాక్కెళుతుంది. పాఠకుడి మనసు ప్రక్షాళనం చేస్తుంది. ఆతని హృదయ క్షేత్రంలో మానవత్వపు విత్తనాలను నాటి జీవితాన్ని సారవంతం చేస్తుంది. వీరి కథలు మదురానుభూతినే గాక జీవిత రహస్యాలవగతమయ్యే జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. మనసుకు పట్టిన తుప్పును వదిలిస్తాయి.

మునిపల్లె రాజు ప్రతి కథా ఒక లయాత్మకమైన జీవన సంగీతాన్ని కలిగివుంటుంది. అయితే ఆ సంగీతం సాధారణమైంది కాదు. అమరత్వాన్ని సాధించే మాధుర్యం కలిగిన సంగీతమది. కాబట్టి ఈ కథలు రచయితకు, పాఠకుడికి మధ్యన ఒక భావాతీత ఆత్మికబంధాన్ని పదిలపరుస్తాయి. మరి అలాంటి అద్భుతమైన అనుభూతిని, సాహిత్య అనుబంధాన్ని నేటి యువత పెంపొందించుకోవాలంటే ఈ కథల్ని చదవాల్సిందే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good