ప్రముఖ రచయిత శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ సర్వస్వంలో ప్రస్తుతానికి ఇది చివరి సంపుటం. శ్రీ రమణ అనువాదశైలి గురించి పరిచయం చేసే ఈ సంపుటిలో '80 రోజుల్లో భూప్రదక్షిణం', 'పిటి 109' కనబడతాయి. మొదటిది జూల్స్‌వెర్న్‌ (1828-1905) రాసిన 1873 నాటి నవల. రెండోది 1961లో గ్రంధస్థం చేసిన రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన యదార్ధగాథ.
'80 రోజుల్లో భూప్రదక్షిణం' కధాంశం ఓ పెద్ద మనిషి పందెం కాసి 80 రోజుల్లో భూమిచుట్టూ తిరిగిరావడం. కథ చెప్పడంలో జూల్స్‌వెర్న్‌ సరదాగా చెప్పుకుపోతాడు. అతనెంత హుషారుగా చెప్పాడో రమణగారు కూడా అంతే హుషారుగా తెలుగులో కథ నడిపించారు. రచయితలోకి పరకాయ ప్రవేశం చేసి ఆయన తెలుగులో రాసివుంటే ఎలా రాసేవాడో అలా రాశారు. తనే ఆ నవల ఒరిజినల్‌ రాసినంత ధాటీగా, స్వేచ్ఛగా రాశారు.
'పిటి 109' కెనెడీ అమెరికా అధ్యక్షుడైన తరుణంలో రాబర్ట్‌ డోనవాస్‌ అనే జర్నలిస్టు 'పిటి 109 - జాన్‌ ఎఫ్‌ కెనెడీ ఇన్‌ వరల్డ్‌ వార్‌ టూ' అనే పేరుతో ఓ పుస్తకం రాశాడు. కెనెడీకి ఆ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్లామర్‌ని దృష్టిలో పెట్టుకుని అది పలుభాషల్లోకి అనువదితమైంది. ఇది కెనెడీ రాజకీయాల గురించిన కథ కాదు. యుద్ధాన్ని ప్రేరేపించే రచనా కాదు. అమెరికావారిని పైకెత్తేసి, జపాను వారిని ఈసడించే రచన అంతకన్నా కాదు. కష్టసమయంలో ఓ లీడరు ఎలా వ్యవహరించాలో చెప్పే స్ఫూర్తిదాయకమైన గాథ ఇది. అది కెనెడీ పరంగా చెప్పడం జరిగింది.వాస్తవ సంఘటనలు గనుక అతిశయోక్తులు, అలంకారాలు తక్కువ. ఈ నవల అనువాదం కూడా ఒరిజినల్‌లాగానే గంభీరంగా సాగుతుంది. అయినా 'రమణ' మార్కు చెణుకులు అక్కడక్కడ తగులుతాయి.
శ్రీ ఎమ్సీయస్‌ ప్రసాద్‌ గారి సంపాదకత్వ నిర్వహణలో వెలువడిన ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ సర్వస్వం 8 సంపుటాల ద్వారా రమణగారు నేటి తరానికి కూడా అభిమాన పాత్రులయినారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good