ముక్తి లేక మోక్షము అనేది మానవుని చరమ గమ్యం. ఈ గమ్యాన్ని చేరుకొనేవరకు కర్మవాసనలు జీవిని అంటియే యుంటాయి. కర్మవాసనలు, మిగిలియున్నంతవరకు ''పునరపి జననం పునరపి మరణం'' తప్పదు. జన్మలు లేకుండా వుండాలంటే వాసనలు నశించాలి. కర్మలవల్ల వాసనలు జీవుని అనగా  మనస్సును అంటుకొని వుంటాయి. మనస్సును నిర్వాసనము అనగా వాసనలంటుకొనకుండా వుండుటను చేయడానికి మనస్సును సాధనలతో శుద్ధం చేసి కర్మలయందు దానికి నిస్సంగత్వం కలుగజేయాలి. అందున చేసే ప్రయత్నం అనుభవసిద్ధులగు మహాపురుషులు సూచించేరు. అందు 'దమ్మపదం' అనే పేరుతో నిర్వాణమార్గాన్ని అనగా వాసనలు ఆరిపోయే పద్ధతిని నిరూపించినవాడు, శ్రీ బుద్ధభగవానుడు. శాస్త్రమార్గంలో తత్త్వాలను సంఖ్యాపరిగణం చేసి తత్త్వ మార్గంలో సాధనలతో వాసనా నాశం కల్గించే విధానం చెప్పింది 'కపిలమహర్షి' రచించిన 'సాంఖ్యశాస్త్రం'. ఇంకా యోగమార్గంలో ప్రాణాయామంతో కుంభయోగాన్ని ప్రముఖంగా ప్రతిపాదించి తద్వారా వాసనా నాశనం నిరూపించినది ''పతంజలి'' మహర్షి యొక్క యోగశాస్త్రం. ఉపాసనతో మనస్సును ఏకాగ్రతలో వుంచితే వాసనా నాశనం సిద్ధిస్తుందని శ్రీ భగవాన్‌ వాశిష్ఠ 'గణపతిముని' 'విశ్వమీమాంస' అనే గ్రంథంలో 'ఉపాసనా' విధానం నిర్దేశించేరు. ''నేను, ఎవరు?'' అని ప్రశ్నించుకొని 'అహం బ్రహ్మాస్మి' అనే అనుభూతిని పొందడమే ముక్తి. దానికి ఆత్మవిచారణ జరపడం తప్ప వాసనా నాశనానికి మఱొక దారి లేదని తమ అనుభవాన్ని శ్రీ రమణమహర్షులవారు ''కో అహం'' అనే గ్రంథం ద్వారా, ఆత్మవిచార మార్గాన్ని పేర్కొన్నారు.

శాస్త్ర మార్గం, ముక్తి వివేక మార్గం అనేవి రెండూ ఎన్నో విషయాలలో ఐక్యపడి వున్నాయి. అందుచేత శాస్త్రవివేకమార్గాలలో ఈ గ్రంథంలో పునరుక్తులు పాఠకులకు కొన్ని కన్పించినా, సాధకునకు ధృఢస్థితిని కల్గించుటకై ఆ పునరుక్తులు వారి గ్రంథాల నుండి పరిహరింపకుండా నేను యధాతధంగా వుంచినందుకు పాఠకులు మన్నించగలరని తలుస్తాను. - వేదుల సూర్యనారాయణ శర్మ

Write a review

Note: HTML is not translated!
Bad           Good