'నాలా మాట్లాడే స్త్రీలను భరించడం కష్టం సీతా. నేను తప్పు చేశానని ఒప్పుకుంటే భరిస్తారు. పాపానికో ప్రాయశ్చిత్తం ఉంటుంది. తప్పు చేయలేదని వాదిస్తే నా మీద జాలిపడతారు. అన్యాయంగా దోషం ఆరోపించారని నా పక్షం వహిస్తారు. కానీ నా తప్పొుప్పులతో మీకేమిటి సంబంధం? అది విచారించే హక్కు, అధికారం మీకెవరిచ్చారంటే మాత్రం ఎవరూ సహించరు.''
''నువ్వంటే నువ్వే. శ్రీరాముని భార్యవు మాత్రమే కాదు. అంతకు మించినది, అసలైనది నీలో ఉంది. అదేమిటో తెలుసుకోవాలని స్త్రీలకెవరూ చెప్పరు. పురుషుల అహం ఆస్తులలో, ప్రతాపాలలో, విద్యలో, కులగోత్రాలలో వుంటే స్త్రీల అహం పాతివ్రత్యంలో, మాతృత్వంలో వుంటుంది. ఆ అహంకారాన్ని దాటాలని స్త్రీలకెవరూ చెప్పరు. విశాల ప్రపంచంలో తాము భాగమని వారు గుర్తించరు. ఒక వ్యక్తికి, ఒక ఇంటికి, ఒక వంశ గౌరవానికి పరిమితమవుతారు. అహాన్ని జయించడం పురుషులకు ఆధ్యాత్మిక గమ్యమవుతుంది. అహాన్ని పెంచుకోవడం, ఆ అహంలోనే కాలి బూడిదై పోవడం స్త్రీల గమ్యమవుతుంది. సీతా - నువ్వెవరో, నీ జీవితగమ్యమేమిటో తెలుసుకోడానికి ప్రయత్నించు. అది అంత తేలిక కాదు. కానీ ప్రయత్నం ఆపకు. చివరకు తెలుసుకుంటావు. నీకా శక్తి వుంది. శ్రీరామచంద్రుడిని కాపాడగలిగినదానివి నిన్ను నువ్వు కాపాడుకోలేవా.''

Write a review

Note: HTML is not translated!
Bad           Good