రావు బాలసరస్వతీదేవి మదిలోని మధురభావం....
ఆమెది స్వరం కాదు. తెలుగు ప్రేక్షకులకో వరం. ఆమెది గాత్రం కాదు. సంగీత సరస్వతి తన ప్రతిభను రసజ్ఞులకు అందించడానికి పడే ఆత్రం. అనుకరణలకు అతీతమైన గాయకురాలిగా ఆమె గురించి తెలుగువారు సగర్వంగా చెప్పుకుంటారు. ఎవరి విషయంలోనైనా భేదాభిప్రాయాలుంటాయేమోగానీ, ఆమె గాత్ర మాధుర్యం విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి అభిప్రాయభేదముండదు. ఆమే రావు బాలసరస్వతీదేవి. నేటి యువతరానికి తెలీక పోవచ్చుగాని మధ్య వయస్సు వారికీ, ఆపై వయస్సు వారికీ ఆమెను పరిచయం చేయక్కరలేదు. 'నల్లనివాడ నే గొల్లకన్నెనోయీ...' అంటూ ఆమె పాడితే విని మైమరచిన వారే వారంతా. అలా పాటే శ్వాసగా పెరిగిన అలనాటి మధురగాయని ఆర్.బాలసరస్వతీదేవి.
శ్రీమతి రావు బాలసరస్వతీదేవి తొలితరం నేపథ్యగాయని, నటీమణి. ఆమె తెలుగు చలనచిత్ర ప్రారంభ వికాస దశలకు వర్తమానంలో మిగిలివున్న కొండగుర్తు.
స్ఫూర్తి అవార్డుల ప్రదానం, ఉత్తమ గ్రంథాల ప్రచురణ, విశిష్టమైన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణల ద్వారా గుంటూరులో సాంస్కృతిక చైతన్యానికి దోహదపడుతున్న బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ 'లలితస్వర శారిక' శ్రీమతి రావు బాలసరస్వతీదేవిని విశిష్ఠ సేవా పురస్కారంతో 13-09-2015న సన్మానించింది. ఈ సందర్భంగా 'బాల'కి అభినందన ఈ 'నిండు పున్నమి పండు వెన్నెల'.
ఆమె పాడిన పాటల పాఠం పాఠకులకు అందించాలని ప్రయత్నం. సినిమా పాటలను కూడా సాహిత్యంగా అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని శ్రీశ్రీ యేనాడో సెలవిచ్చాడు. నలుపు తెలుపు చిత్రంలోని ఎన్నో పాటలు కావ్యగౌరవాన్ని పొందగలిగేవి వున్నాయి. సూక్ష్మంలో మోక్షంలాగా పెద్ద పెద్ద విషయాలను అలతి అలతి పదాలతో వ్యక్తీకరించగలిగే స్థాయికి పాటను తీసుకెళ్లారు కవులు.
'బాల' పాడిన పాటలు ముద్రిత రూపంలో దొరికేవి చాలా తక్కువ. వీలైనన్ని సేకరించి ప్రచురించాలని తపన. అయితే ఎక్కడ దొరుకుతాయవి? సినిమా అంటే అభిరుచే కానీ సేకరణ లేదు నావద్ద. ఈ స్థితిలో ''ఇంత వలవేసి అంత పెద్ద చేపను పట్టేదెవరు'' అని అట్టే కంగారుపడనవసరం లేకుండా 'నేనున్నాను' అన్నారు డాక్టర్ కంపెల్ల రవిచంద్రన్.
వివిధ భాషలలో 'బాల' పాడిన పాటలు రెండువేలు ఉండొచ్చును అంటున్నారు. తెలుగు చలనచిత్రాలకు 'బాల' పాడిన పాటలు స్వల్ప వ్యవధిలో సేకరించగలిగినన్ని సేకరించి కాలక్రమంలో పొందుపరిచాము. ''ఆదర్శం'', ''కన్యాదానం'', ''భూలోకరంభ'' పాటల పుస్తకాల్లో టైటిల్స్‌లో రావు బాలసరస్వతి పేరుంది గానీ, ఏ పాట ఆమె పాడారో గుర్తించలేక పోవడం వల్ల వాటిని ఇందులో చేర్చలేకపోయాము.
'బాల'కి సంగీత ప్రపంచంలో ఒక ప్రత్యేకతను, ధన్యతను కల్పించినవి ఆమె పాడిన లలితగీతాలే కనుక, వాటిని కూడా అచ్చువేయవలసిందే. 42 లలిత గీతాలను సేకరించి మీకు అందించగలుగుతున్నాము. పూర్వం ముద్రితమైన పాఠాలకు, రికార్డులో వినబడే పాఠాలకు, పరిశోధకులు అక్కడక్కడా ప్రస్తావవశాత్తు ఉదహరించిన పాఠాలకు మాటలలో కొద్దికొద్దిగా తేడాలున్నాయి. ప్రధానంగా సినిమా పాటల పుస్తకాలు, లలిత గీతాల రికార్డులు మాకు ఆధారం. ఇందులో చేరని పాటలను అభిమానులు మాకు అందించగలిగితే మలిముద్రణను మరింత సుసంపన్నం చేయగలము.
ఈ సంచికలో తన జీవితంలోని ప్రధాన ఘట్టాలను గురించి బాలసరస్వతీదేవిగారి రచన (16 పేజీలు)తోపాటు ఎస్.సదాశివ, శివాజి, వి.ఎ.కె.రంగారావు, గొరుసు జగదీశ్వర రెడ్డి, డా|| కంపల్లె రవిచంద్రన్ తదితరుల వ్యాసాలు, ఆమె పాడిన వందలాది పాటలు, ఆమె గురించి సమకాలీన గాయకుల అభిప్రాయాలను చేర్చడం జరిగింది.