మో' కవిత్వమంతా సగటు వ్యక్తి ఆత్మిక ప్రపంచపు సంక్షోభానికి వ్యక్తీకరణ. సంక్షోభం ఫలితంగా వ్యక్తి గురయ్యే వేదనకు అక్షరరూపం. అస్తిత్వ ఆందోళనలో వున్న వ్యక్తి అస్థిరతకు స్థిర రూపం. యాంత్రిక ప్రపంచంలో నిర్లిప్తంగా మిగిలిన వ్యక్తి అర్థరాహిత్యపు అస్తిత్వాన్ని గురించిన ఆక్రందనల ఆవిష్కరణ 'మో' సారాంశం.
'మో' కవిత్వమంతా మనిషి స్వప్నాలకు, భ్రమలకు, వైఫల్యాలకు సంబంధించిన ఒప్పుకోళ్ళు(కన్ఫెషన్స్‌), వర్తమాన ప్రపంచంలో ధ్వంసమయిపోయిన కమ్యూనిటేరియన్‌ విలువల గురించి, వాటి స్ధానంలో రూపుదిద్దుకున్న కృతిమత్వాన్ని గురించీ, మృత్యువు, ఒంటరితనం, హత్యలు, జబ్బులు, ఆర్ధిక, ఆత్మిక అవినీతి, నిజాయితీ లేనితనం లాంటి విషయాలన్నీ ఆయన కవతా వస్తువులయ్యాయి. ఇన్ని రకాల భీభత్సాలతో కూడుకున్న వాస్తవికతనుంచి నిరంతరం పారిపోవడంలో వున్న ధైర్యాన్ని గురించి ఆయన రాశారు. మనం నిరంతరం రూపొందించుకుంటున్న ఆదర్శాలు కూడా ఈ పారిపోయే ప్రయత్నంలో ముందుకొచ్చినవేనని ఆయన భావించారు. ఈ భావవ్యక్తీకరణను ఆయన తాత్వికంగా కాక కవితాత్మకంగా ప్రతిబింబించారు. 'మాయాదేవి స్వప్నం' (పునరపి) కవితల్లో ఈ విషయాలు చాలా స్పష్టంగా తెలుస్తాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good