"టీచర్ వచ్చిందని మనం మాట్లాడుకున్నట్లు మాట్లాడతా వేమిటి? పెద్దవాళ్లను గురించి మాట్లాడేటప్పుడు గౌరవంగా టీచర్‌గారు చెప్పలా? టీచర్‌గారు వచ్చారని అనాలి... టీచర్ అనకూడదు.." వెంటనే అందుకొని ఆ పిల్లకు బుద్ధి చెప్పింది మరో బాలిక.
"ఏ కథలు చెప్పారు?" వినోదంగా చూస్తూ అడిగాడు రాజీ పహిల్వాన్.
"మంచి పనులు చేసేవాళ్లకి అన్నీ మంచిగానే జరుగుతాయని చెప్పారు... " చెడ్డపనులు చేసేవాళ్ళను శిక్షించటానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే వుంటాడట.." అంటూ తమ టీచర్ చెప్పిన కథనొకదాన్ని వల్లించటం ఆరంభించిందా బాలిక.
ఎందుకనో ఎప్పటి మాదిరి హుషారుగా ఆ మాటల్ని వినలేక పోయాడు రాజీ పహిల్వాన్. తనను దృష్టిలో పెట్టుకునే ఆ టీచర్ అటువంటి కథను వాళ్లకి చెప్పటం జరిందేమోనన్న అనుమానం అతని మనస్సులో అడుగుపెట్టింది.
"మీ టీచర్ గారు ఎలా వుంటుంది? బాగుంటుందా?" వున్నట్టుంది కథకు అడ్డుతగులుతూ అడిగాడు.
"బాగుంటుంది... చాలా బాగుంటుంది.. ఇంకా పెళ్లి కాలేదని మా అమ్మ మా నాన్న అనటం నేను విన్నాను..." వెంటనే తనకు తెలిసిన సమాచారాన్ని అతనికి తెలియచేశాడు ఒక బాలుడు.
" నా గురించి మీ టీచరుగారికి తెలుసా?" అడగకూడదని ఎంతగా అనిపిస్తున్నా ఆగలేక అడిగేశాడు రాజీ పహిల్వాన్..
పెద్దగా నవ్వింది కథ చెపుతున్న బాలిక.. ఆమెతోపాటు నవ్వారు అక్కడ వున్న వారందరూ..
"ఎందుకు నవ్వుతారు?" ఆశ్చర్యంగా అడిగాడు రాజీ పహిల్వాన్.
"మా గురించే టీచరుగారికి పూర్తిగా తెలియదు.. నీ గురించి ఎలా తెలుస్తుంది? అసలు నీ గురించి తెలియటానికి నువ్వేమయినా మా బళ్లో చదువుకునే చిన్న పిల్లాడివా?"నవ్వుతూనే ప్రశ్నించింది కథ చెపుతున్న బాలిక.
తన అవివేకాన్ని తలుచుకునేసరికి రాజీ పహిల్వాన్‌కి కూడా నవ్వు ముంచుకు వచ్చింది. వాళ్లతో కలిసి తను కూడా నవ్వుతుండగా అతని కోసం అటుగా పరిగెత్తుకు వచ్చారు ధీరజ్‌దాదా అనుచరులు యిద్దరు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good