సుప్రసిద్ధులైన కథకులు సత్యవతిగారిని చూయించి ''ఇదుగో ఈమె గొప్ప కథకురాలు'' అని చెప్పటం ఎంత అసహజం! సత్యవతిగారి ముద్ర ఒకటి వుంది. తాత్విక భావజాలాన్ని సబ్మెర్జ్ చేసి - కాదు - అంతర్లీనం చేసి అద్భుతమైన కథలు వ్రాయవచ్చు. రాసి చూపించారు. అద్భుతమైన నెరేటివ్ స్టయిల్ వుంది. అది ఆమె స్వంతం. కథ ఎత్తుకున్న దగ్గరనుంచి ఆన్ఫోల్డ్ చేసే దాకా ఒక పద్ధతిలో పాఠకుణ్ణి - కథ వెంట డ్రైవ్ చేసే విధానం అపూర్వమైనది.
దరాదాపు నాలుగు దశాబ్ధాల సృజన తర్వాత - కిట్స్ అన్నట్టు మెలోయిడ్ ఫ్రూట్ఫుల్నెస్ అంతటా పరిమళిస్తున్న ఆమె కథలు చదవటం ఒక అనుభవం. పట్టరాని ఆనందం. కృష్ణా, గుంటూరు జిల్లాల యాసని, నుడికారాన్ని, వ్యక్తీకరణని, బ్రహ్మాండంగా పట్టుకున్నారు. ఆమె కథా పరిభాష ఆమెకొక జలం.
నన్నీ నాలుగు మాటలు రాయమనడం నన్ను గౌరవించటానికి తప్ప మరొటి కాదు. ఈ కథలు ఆంగ్లంలోకి అనువదిస్తే, లాటిన్ అమెరిరన్ పాఠకులు ఎలా స్పందిస్తారు? ఆనందిస్తారు! మార్కిజ్ నీ, లోసానీ మనం ఆనందించడం లేదూ అలాగే! అనుభవం నిర్దిష్టమయినదైనా, అది మానవానుభవం. జీవనా సుభవం. అయినప్పుడు అది విశ్వజనీనతని పొందుతుంది. స్ధలకాలాలను అధిగమించి బతికే శక్తి దానికొస్తుంది. సత్యవతిగారి కథలకు ఆ శక్తి వుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. - కె.శివారెడ్డి.