ఒక మనిషి బలం బలహీనతలు అతడి మాటల ద్వారానే తెలుస్తాయి. ఈ మాటల ప్రయోగం చేతగాకపోతే చాలామందిని అధ:పాతాళానికి తొక్కేస్తాయి. ఉన్నతమైన ఈ మాటలే ఒక మనిషిని ఆకాశమంతగా నిలబెడతాయి. ఈ మాటలు ఉన్నతంగా వుండాలన్నా, నీచంగా వున్నాయన్నా అతడి బుద్ధినే చూపిస్తాయి.

    ఒక మనిషి ఆత్మవిశ్వాసమే ఈ మాటలు. ఒక మనిషి ఆలోచనలే ఈ మాటలు. నీ మాటల్లో నీ ఆలోచనలు, బుద్ధి, శక్తి, ఆశక్తి, విధేయత, వినమ్రత, సహనం, నేర్పు, ఓర్పు, పరిణితి తేటతెల్లమవుతుంది.

    ''సూది మొన మోపినంత రాజ్యం కూడా ఇవ్వను'' అనడంతో దుర్యోధనుడి దురాశ, దుర్బుద్ధి తెలుస్తుంది.

    ''తండ్రి మాట కోసం అడవులకేగుతాను'' అనడంలో శ్రీరాముడి పితృవాక్య పరిపాలన అర్థమవుతూ వుంది.

    ''ఏనుగు పై నుండి ఒక బలమైన మావటివాడు బంగారు నాణాన్ని బలంగా పైకి విసిరితే ఎంత ఎత్తుకు వెళ్ళగలదో అంత పరిమాణంలో నాకు ధనం కావాలనడం''లో విశ్వామిత్రుడి ఎత్తుగడ తెలుస్తూ వుంది.

    ''ఆకాశమూ భూమి ఏకమైనా సరే నేనీ పని చేసి తీరుతాను'' అంటే అతడి పట్టుదల గమనించగలం.

    ''చీమ చిటుక్కుమన్నా విన్పిస్తుంది'' అంటే అక్కడ ఎంత నిశ్శిబ్దం తాండవిస్తూ వుందోమరి.

    ''నువ్వేమి చెప్పినా సరే నేను వినను'' ఆ మనిషి మొండితనం గమనిస్తాం.

    ఈ మాటలే మనిషి నిజ స్వరూపం. ఆ మాటలకెంతో విలువ వుంది. ఆ మాటల్లో ఎంతో మాట వుంది. ఆ మాటల్లో ఎంత రమ్యత, గాఢత, మాయా మహేంద్రజాలముంది.

    ఆ మాటల మహత్యమేదో లోతుల్లోకి వెళదాం!

    ''వినదగు నెవ్వరు చెప్పిన

    వినినంతనె వేగపడక వివరింపతగున్‌

    కనికల్ల నిజము తెలిసిన మనజుడెపో

    నీతిపరుడు మహిలో సుమతీ!'' అన్నాడు నీతి బోధకుడు. మాటల్లో అర్థం పరమార్థం ఎరిగి ప్రవర్తించే వాడే దేనినైనా సాధించగలడు. ఈ ప్రపంచాన్ని మాటలతో జయించగలడు.

    ''మాటే మంత్రమూ

    మనసే బంధమూ'' అన్నది కవి వాక్యం.

    - డి.రామచంద్రరాజు

Write a review

Note: HTML is not translated!
Bad           Good