వైద్యులకు, వైద్య గ్రంథాలకు, వేదాలకే పరిమితమైన వైద్యశాస్త్ర రహస్యాలను, మర్మాలను... ఇంటింటిలోని వంటింటిదాకా చేర్చిన ఘనత పూర్ణచందు గారిదే. ఈ విషయంలో ఘనాపాటి వీరే.
పదేళ్ళ పసివాడు మొదలుకొని పండుముదుసలి సైతం అర్థం చేసుకుని, ఆచరించేందుకు అనువైన భాష... ఈ చికిత్సల కోసం, కొండలు, గట్లు, పుట్టలు తిరిగి మూలికలు వెతికి తెచ్చుకునే అవసరం లేకుండా... అతి సులభంగా లభించే సాధారణ దినుసులు, ద్రవ్యాలు, మూలికలతోనే ఎన్నో అత్యద్భుత చికిత్సలను అందించిన డా॥ పూర్ణచందు గారికి... తెలుగు పాఠకశ్రేణి నిజంగా ఋణపడి వుందనే చెప్పాలి.
బొల్లి, బోద, శోభి, రక్తక్షీణత, పేగుపూత, కీళ్ళవాతం, పక్షవాతం, షుగర్, ఉబ్బసం... ఇలా ఎన్నో వ్యాధులకు, వ్యాధి బాధలకు వైద్యులతో నిమిత్తం లేకుండ వైద్య చికిత్స మీకు మీరు స్వయంగా చేసుకునేందుకు ఈ గ్రంథం ఎంతగానో ఉపకరిస్తుంది. కనుక... దీనికి 'మీ వ్యాధులకు మీరే వైద్యులు' అన్నపేరు చక్కగా అతికినట్లు సరిపోయింది.
మధ్య తరగతివారికి 'నేటి వైద్యం' అందని తేనెతుట్టెలా తయారైన ఈ రోజుల్లో, ఇంతటి చక్కని ఆరోగ్య రసామృతాన్ని అందించి... సులభ చికిత్సలను ప్రతివారికీ చేతికందుబాటులోకి తెచ్చిన రచయిత, మా మిత్రులు డా॥ పూర్ణచందు గారు సదా అభినందనీయులు. తన అద్భుతశైలితో పాఠక హృదయ పీఠాలపై రారాజుగా పట్టాభిషిక్తుడైన పూర్ణచందుగారు... పాఠక హృదయాలలో చిరస్మరణీయులుగా మిగిలిపోతారు.
- వట్లూరి నారాయణరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good