పత్రిక నుంచి ఫేస్బుక్ దాకా మీడియా మన నిత్యజీవితపు అడుగులో, ఆలోచనలో, విజయంలో, పరాజయంలో, ఉత్సాహంలో, వికారంలో తోడుగా నీడగా కలిసి కదులుతోంది. ఈ ముద్ర రోజురోజుకూ పెరుగుతోంది. ఫలానా పత్రిక ఇలా రాసిందేమిటి? ఫలానా టీవీ అలా చెప్తోందేమిటి? ఈ ప్రోగ్రామేమిటి ఇలా ఉంది, నా పిల్లలు చూడచ్చా? మా అబ్బాయేమిటి ఇరవై నాలుగు గంటలూ కంప్యూటర్ను, మొబైల్ను వదిలిపెట్టం లేదు? ఏ రాత నిజం, ఏ కథనం సత్యం, ఏది మంచి, ఏది చెడు?
పూర్వం పత్రికలు, టీవీలు, ఇంటర్నెట్లు, ఫోన్ల ధాటి ఇంతగా ఉండేది కాదు. వాటి ఆనుపానుల గురించి ఇంతటి స్పృహ ఉండేది కాదు. ఇంతటి పట్టింపు ఉండేది కాదు. కానీ మీడియా, పై-లిన్లా ప్రతి క్షణాన్నీ, ప్రతి పార్శ్వాన్నీ తినేస్తోంది. భావోద్వేగాలనూ రాజేస్తోంది. మీడియా పోక గురించి, దానితో ముడిపడి ఉన్న యాజమాన్యాల స్వార్థాల గురించి, రేటింగ్ల గురించి- సమస్తం తెలుసుకోవాలన్న ఆలోచన సామాన్య ప్రజానీకంలోనూ రానురానూ బలపుతోంది.
ఈ పుస్తకం మీ అన్వేషణకు విరామం ఇస్తుంది. మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంది. మొత్తంగా మీడియాకు సంబంధించిన మీ అవగాహనను, పరిధిని పెంచుతుంది.
మీ సౌలభ్యం కోసం ఐదు భాగాలుగా ఈ పుస్తకాన్ని అమర్చాం. వీటిలో వ్యాసాలు, విశ్లేషణలు, జర్నలిస్టులు, జననేతలకు దారిచూపే సంగతులున్నాయి. మొదటిభాగం ప్రధాన మాధ్యమాల గురించిన స్థూల అవగాహనకు దోహదపడుతుంది. రెండోభాగం కొన్ని మీడియా సంస్థల గురించీ, అంశాల గురించీ లోతుగా తెలుసుకోవటానికి వీలు కల్పిస్తుంది. మూడోభాగం జర్నలిస్టుల కోసం ఉద్దేశించినా అందరికీ ఆసక్తి కలిగించే, అవగాహన పెంచే విశేషాలున్నాయి. జర్నలిస్టుల జీవితాలు, వారు వృత్తిపరంగా చేసే పొరబాట్లను గ్రహించవచ్చు. నేతలు మీడియాను ఎలా చూడాలి, ఎలా మెలగాలి అనే విషయాలను నాలుగో భాగంలో చదవచ్చు. పత్రికల రాతలు, టీవీ కార్యక్రమాలపై ఐదో భాగంలో విశ్లేషణలున్నాయి.
మీడియా పట్ల ఆసక్తి ఉన్న వారికి, జర్నలిస్టులకు, జర్నలిజం విద్యార్థులకు, ప్రజాజీవనరంగంలోని వారికి ఈ పుస్తకం ఆసక్తి కలిగిస్తుందని భావిస్తున్నాను.
- డాక్టర్ గోవిందరాజు చక్రధర్

Write a review

Note: HTML is not translated!
Bad           Good