భూమి అంతా కొందరి ఆస్తులుగా వుండడం, పైకి కనపడే విషయం. పైకి కనపడేదే 'సహజం' అనిపిస్తుంది. ఇతర ఉత్పత్తి సాధనాలన్నీ కొందరి ఆస్తులు! అది కూడ సహజం! భూమి కౌళ్ళూ, వడ్డీ - లాభాలూ, అన్నీ సహజాలే! న్యాయాలే! కానీ, ఆ ఆస్తులూ, ఆ హక్కులూ, ఆ ఆదాయాలూ అన్నీ, అబద్దాలే, అన్యాయాలే, అసహజాలే! అసలు సత్యం - శ్రమ దోపిడీ! శ్రామిక వర్గపు శ్రమలో నించి అత్యధిక భాగాన్ని లాగుతూ యజమాని వర్గం జీవిస్తుంది. కానీ అది పైకి కనపడదు!
దాగి వున్న సత్యాన్ని గ్రహించడానికి సైన్సు కావాలి.
రహస్య సత్యాన్ని వివరించేదే - సైన్సు!

'సోషలిజం' అనే మాటని దోపిడీదారులు కూడా వాడతారు. తమ విధానాలే సోషలిజం అయినట్టు శ్రామిక ప్రజల్ని భ్రమల్లో పెట్టడానికి ప్రయత్నిస్తారు. సోషలిజం, అనేక అర్ధాలతో కనపడుతుంది. ఫ్యూడల్‌ సోషలిజం, పెటీ బూర్జువా సోషలిజం, నెహ్రూ సోషలిజం, లోహియా సోషలిజం - ఇలా రక రకాలుగా! కానీ, మార్క్సిజానికి ఈ రకాలు వుండవు. 'మార్క్సిజం' అనే మాటని బూర్జువాలు ముట్టుకోరు. వాళ్ళు అప్పుడప్పుడూ 'సోషలిజాన్ని' ఉపయోగించుకోవడానికే ప్రయత్నిస్తారు గానీ, 'మార్క్సిజాన్ని' పలకడానికి జడుసుకుంటారు.

సమస్యలు, అనేక తేడాలతో, వేరు వేరు రూపాలతో, కనపడతాయి. బీదరికం సమస్యలు, కులాల సమస్యలు, మతాల సమస్యలు, జాతుల సమస్యలు, ప్రాంతాల సమస్యలు, పురుషాధిక్యత వల్ల ఏర్పడే కుటుంబ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు - ఇలాంటివన్నీ సమాజం నిండా వున్న అన్యాయాలకు వేరు వేరు రూపాలు! ఏ రెండు సమస్యలకూ సంబంధం లేనట్టూ, ప్రతీ సమస్యా ఒక స్వతంత్ర కారణంతో కొనసాగే సమస్య అయినట్టూ, పైకి కనపడుతుంది. కానీ, అన్ని సమస్యలకూ పునాది ఒకటే. వేరు వేరు సమస్యల్ని సృష్టించే సమాజం, ఒకే పునాది మీద నిలబడ్డదే. ఇక్కడ వేరు వేరు సమాజాలు లేవు. దానికి వేరు వేరు పునాదులు లేవు!
ఏ సమస్యని తీసుకున్నా, మొదట దాన్ని అర్ధం చేసుకోవాలంటే, ఆ సమస్యలో వున్న వ్యక్తి గానీ, బృందం గానీ, 'శ్రమ సంబంధాల్లో ఏ స్థానంలో వున్నారో' గ్రహించుకోవాలి. దోపిడీ చేసే స్థానంలోనా, దోపిడీకి గురి అయ్యే స్థానంలోనా? ఏ పాత్ర నిర్వహిస్తున్నారు? గృహ శ్రమల్లోనా, బైటి శ్రమల్లోనా, ఏ శ్రమలూ లేకుండానా? - ఇది మొదట చూడాలి. దీన్ని బట్టే పోరాట రూపమూ, పరిష్కారమూ!

Write a review

Note: HTML is not translated!
Bad           Good