మార్క్స్‌ - ''కాపిటల్‌'' పరిచయం (మొత్తం 2 సంపుటాలలో) - రంగనాయకమ్మ
మానవులకు 'మానవ సమాజం' గురించి తెలుసుకోడానికి మించిన జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రీయమైన గ్రంధం మార్క్స్‌ రాసిన 'కాపిటల్‌' ఒక్కటే.
మానవ సమాజం సృష్టించుకున్న విజ్ఞాన సంపదల్లో - 19వ శతాబ్దపు జర్మన్‌ తత్వ శాస్త్రమూ, ఇంగ్లీషు ఆర్ధిక శాస్త్రమూ, ఫ్రెంచి సోషలిస్టు సిద్ధాంతమూ, అత్యంత ప్రధానమైనవి. ఆ మూడింటిలోనూ వున్న అశాస్త్రీయ, భావ వాద లక్షణాలను తొలిగించి, వాటిని పూర్తిగా శాస్త్రీయమైన పునాదులమీద నిలబెట్టిన దాని ఫలితమే - 'మార్క్స్‌ సిద్ధాంతం'!
'కాపిటల్‌' ఆవిర్భావం మానవ సమాజ చరిత్రలో అత్యద్భుతమైన ఘటన. గత లక్షలాది సంవత్సరాలలో జరిగిన ఘటనల కన్నా అది భిన్నమైనది. ఎందుకంటే - మానవ ప్రపంచానికి దాస్యశృంఖలాల నించీ; 'దోపిడీ' అనే అమానుషత్వం నించీ; జుగుప్సాకరమైన వర్గ భేదాల నించీ; క్రూరాతి క్రూరమైన యుద్ధాల నించీ; సంక్షోభాల నించీ; యుగ యుగాల దుఖా:ల నించీ, కన్నీళ్ళ నించీ; జంతు స్థాయి హింస నించీ; అజ్ఞానం నించీ - శాశ్వతంగా విముక్తి నిచ్చే మార్గాన్ని 'కాపిటల్‌' అనే జ్యోతి విస్పష్టంగా చూపించింది.
'ఆర్ధిక శాస్త్రం' అంటే - అందులో చాలా లెక్కలు వుంటాయనీ, లెక్కలు బాగా తెలిసిన వాళ్ళు తప్ప దాన్ని చదవలేరనీ, సాధారణంగా మనందరికీ ఒక అభిప్రాయం వుంటుంది. అది చాలా పొరపాటు అభిప్రాయం. ఆర్ధిక శాస్త్రం అంటే, సమాజపు ఉత్పత్తి విధానాన్నీ, పంపిణీ విధానాన్నీ వివరించే శాస్త్రం. అందులో పెద్ద పెద్ద లెక్కలు వుండవలసిన అవసరం లేదు.ఇందులో ఉన్నదంతా లెక్కలు కాదు, తర్కం. లెక్కలంత ఖచ్చితమైన తర్కం. అంటే, హతుబద్ధమైన చర్చ. ఈ పుస్తకం చదవడానికి, పెద్ద పెద్ద డిగ్రీలూ, పాండిత్యాలూ అక్కర్లేదు. అవి వుంటే నష్టం లేదు గానీ, లేకపోతే కూడా నష్టం లేదు.
ఈ పుస్తకం చదివే వ్యక్తికి ఒక లక్షణం తప్పనిసరిగా ఉండాలి. 'ఆలోచించే' లక్షణం. చాలా పుస్తకాల విషయంలో, చదివే వాళ్ళకి ఆలోచన అక్కర్లేదు. తలకాయ తీసి ఎక్కడన్నా తగిలించి, విశ్రాంతిగా పడుకొని పుస్తకం చదువుకోవచ్చు. కానీ, ఇక్కడ అది పనికి రాదు. ఇక్కడ అడుగడుగునా తర్కమే. పాఠకులు పాల్గొనకుండా రచయిత తర్కం చేయలేడు. ఆలోచించని పాఠకులకు రచయిత ఏమీ బోధించలేడు. రచయిత బాధ్యత రచయిత నిర్వహిస్తే, పాఠకుల బాధ్యత పాఠకులు నిర్వహించాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good