రెండో ఇంటర్నేషనల్‌ అవగాహన ప్రకారమైతే చైనాలాంటి దేశంలో విప్లవం సందేహాస్పదం. వలస దేశాల్లో విప్లవం గురించి లెనిన్‌, స్టాలిన్‌ల ఆలోచనలకు మావో పదును పెట్టాడు. నిర్ధిష్టంగా చైనా సామాజాఇక రాజకీయార్ధిక చరిత్రలోకి, ఆనాటి సామ్రాజ్యవాదంలోనికి వెళ్లి అర్ధ వలస అర్ధ భూస్వామ్య విశ్లేషణ ఇచ్చి దీర్ఘకాలిక ప్రజా యుద్ధాన్ని ఆచరణలోకి తీసుకొని వచ్చాడు. ఈ మొత్తం పరిస్ధితుల మీద ఆయనకు ఉన్న అపారమైన పట్టు వల్ల జనతా ప్రజాస్వామ్యంలోని ప్రతి దశకు అనుగుణమైన ఎత్తుగడలు వేస్తూ వచ్చాడు. చైనా పార్టీ ఆయన నాయకత్వంలోకి వచ్చాక చాలా వేగంగా, సంక్లిష్టంగా మారుతూ వచ్చిన ప్రతి దశలో మావో అనుసరించిన ఎత్తుగడలు సత్ఫలితాలనిచ్చాయి.
ఈ సంపుటిలో ఉదారవాదం గురించిన వ్యాసాన్ని బహుశా ఇప్పటికీ అన్ని విప్లవ నిర్మాణాలు తమలోని ఉదారవాదంపై పోరాటానికి మార్గదర్శకంగా తీసుకుంటున్నాయి. పార్టీ నిజమైన కార్మికవర్గ నిర్మాణంగా విప్లవంలో వ్యవహరించాలంటే ఉదారవాదమనే జాడ్యం నుంచి బయటపడాలి. అందువల్ల ఉదారవాదం ఎన్ని రూపాల్లో, ఎందుకు ఉంటుందో ఆ వ్యాసంలో వివరించాడు. చైనా విప్లవ వికాస దశకు సంబంధించిన అతి ముఖ్యమైన రచనలు ఉన్న ఈ సంపుటి మావో ఆలోచనల వికాసాన్నీ, అందులోని శాస్త్రీయతనూ ఎత్తిపడుతుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good