Rs.100.00
In Stock
-
+
ఈ కథల్లోని 23 కథలు మధ్యతరగతి మందహాసాలను తెలియజేసేవిగా ఉన్నాయి. నగరజీవనం భారమైపోతున్న ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. స్నేహితులు, ప్రేమికులు, భార్యాభర్తలు కలిసి కాసేపు ఆహ్లాదంగా, ఆనందంగా గడిపే వాతావరణం నేడు పట్టణాలలో కనిపించడం లేదు. పార్కుల్లోనూ, ఇంట్లోనూ ప్రైవసీ కోల్పోతున్న నగరజీవుల ఆవేదన ఈ 'మనసున మనసై' పుస్తకం. మనోభావనాసుడిగుండంలోంచి సగటు మనిషిని దర్శించి ఎగుడుదిగుడు పరిస్తితుల్లో కూడా మానవతను పండించారు.
ఈ కథలో మధ్య వయస్కులైన స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధాలు, భార్యాభర్తలు ప్రతి విషయాన్ని చర్చించుకుని అవగాహనతో మేలగాలనే సందేశం, నేటి యువతలో వస్తున్న స్వతంత్ర భావాలూ, తరాల అంతరాలు, అధికారం, అహంకారం, ధనబలంతో వ్యసనమైన భర్తను, తన సహనం, మంచితనంతో తనదారిలోకి తెచ్చుకుని అతనిలోని మృగత్వాన్ని పారదోలి, తన సంసారంలో మల్లెలు విరబూయించుకోవాలన్న మహిళ తపస్సు, జీవితాంతం కష్టసుఖాల్లో పాలు పంచుకొని భరించాల్సిన భర్తే భార్యజీవితంలో చలగాటమాడితే, అలాంటి నరరూప రాక్షసుడి నీడ పడనీయకుండా కూతుర్ని సంస్కారవంతురాలిగా, ఉన్నత విద్యావంతురాలిగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా తన ఔన్నత్యాన్ని నిలుపుకున్న ఆదర్శమహిళ, టీ.వీ మాయాజాలంలో మరుగుతున్న మానవ సంబంధాలు, సంపద కంటే వ్యక్తిత్వానికీ, స్వతంత్ర మనోభావలకూ విలువనివ్వాలనుకునే నేటి యువతలోని వ్యక్తిత్వవికాసం, తల్లిదండ్రులను, మాతృదేశాన్ని, మమతానురాగాలను మరచిపోతున్న నేటి యువతలో పేరుకుపోతున్న పాశ్చాత్య వ్యామోహం, వారి తల్లిదండ్రుల మానసికావేదనలు, స్త్రీ వ్యామోహం కారణంగా ఆహ్లాదంగా సాగే వైవాహిక జీవితం విచ్చిన్నం కావడం లాంటి ఇతివ్రుత్తాలెన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. - ఆచార్య ఎన్.గోపి
మనుసులో మెదిలే ఆర్ద్రమయిన భావాలకు వాకిళ్ళు తెరచి, గాలీ వెలుతురూ ధారాళంగా పారనిచ్చి కష్టసుఖాలకూ వెలుగునీడలకూ స్పందించే చైతన్యాన్నిచ్చి ఆలోచనాధారతో పుష్టిచేకూర్చి, వంపులూ ఒద్దికలూ దిద్ది, మాటలు మీటనట్లైతే అవి కె.బి.లక్ష్మీ కథలవుతాయి. మనసులు కలబోసుకునే స్నేహభాంధవుల్లా కె.బి.లక్ష్మీ కథలు సన్నిహిత మవుతాయి. మనసు పెట్టి చదివేలా చేస్తాయి. వాటి చాలు వెంబడే మనసు తీసుకుపోతాయి. - పోరంకి దక్షిణామూర్తి
ఈ తరానికి మీ కథలు త్యాగరాజ కీర్తనలు. మీ కథా కథన రమ్యత మిత్ర వాక్య సౌమ్యత. కథల్లో అన్ని భౌతిక, తాత్విక బాధలే కనిపిస్తున్న రోజుల్లో మీ కథలు కాస్తంత రిలీఫ్. పైగా అద్భుతమైన రీడబిలిటీ. మీకు రొమాంటిక్ భాష బాగా పట్టుబడ్డట్టుంది. మీ కథల్లో కథత్వగంధి వాక్యాలు కథ Texture కి బాగా ఉపయోగించాయి. - వాకాటి పాండురంగారావు, చేరా