సాహిత్య విమర్శా రంగంలో నా కృషి అటు ప్రాచీన సాహిత్యం మీదా, ఇటు ఆధునిక కవిత్వం, కథానిక, తెలుగు సాహిత్య విమర్శల మీద జరిగింది. నవల మీద నా కృషి చాలా పరిమితమని ఈ గ్రంథమే రుజువు చేస్తున్నది. తెలుగు నవలల మీద నేను రాసిన ఈ పదమూడు వ్యాసాలే నేనింకా చెయ్యవలసిన కృషిని గురించి హెచ్చరిస్తున్నాయి. వీటిలో కొన్నింటిని అఫ్సర్ రాయించగా, తక్కినవి ఇతర సందర్భాల కోసం రాసినవి. 'జగడం' నవలకు ముందు మాట రాయమని బోయ జంగయ్య గారు నన్ను కోరడం నాకు పరమానందమైంది. ఏ ప్రక్రియ మీద విమర్శ రాసినా వస్తు చర్చ మనక బాగా ఇష్టమైంది, అలవాటైంది. నందిని సిధారెడ్డి 'ప్రజల మనిషి' నవలా శిల్పం మీద వ్యాసం రాయమని కోరినప్పుడు ఆనందంగా ప్రయత్నించాను. నవలా శిల్ప శాస్త్రాన్ని ముందు బెట్టుకొని కాక, నవలలో శిల్ప విశేషాలుగా నాకు కనిపించిన వాటిని చెప్పడానికి ప్రయత్నించాను.
'కథాంశం' తర్వాత 2006-2008 మధ్య మూడేళ్ళలో కథానికల మీద నేను రాసిన వ్యాసాలు పది. వీటిలో కొన్ని ముందు మాటలు. అయినా విమర్శనాత్మకంగా రాయడానికే ప్రయత్నించాను. - రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
ఓ పుష్కర కాలంలో వచ్చిన తెలుగు నవలలు, కథానికల మీద విమర్శనా గ్రంథం 'మన నవలలు మన కథానికలు'. సంఘ సంస్కరణ, జాతీయ, అభ్యుదయ, విప్లవ, దళిత, బహుజన, స్త్రీ, ప్రాంతీయ అస్తిత్వవాదాలను, ఉద్యమాలను ప్రతిబింబించిన నవలలు, కథలపై సమకాలీన వాస్తవికతతో చేసిన సద్విమర్శ ఇది. రాగద్వేషాలకు అతీతంగా వస్తు వివేచనతో సాగే విమర్శనా పద్ధతికి నిలువుటద్దం ఈ పుస్తకం.
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా..సాహిత్య, సామాజిక చైతన్యానికి నిరంతరం కృషి చేస్తున్న ఈ కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత కలం నుండి వెలువడిన 'మన నవలలు - మన కథానికలు' అత్యంత అసాధారణ పుస్తకం.