తెలుగుజాతికే గర్వకారణమైన సుమధుర గాయక చక్రవర్తి శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారు. తన జీవితకాలంలోనే కాక యీనాటికీ ఏనాటికీ సకల భావితర గాయకులందరికీ ఆదర్శమూర్తిగా, మార్గదర్శకులుగా భాసిస్తూనే వుంటారు. ఆయనలోని ప్రజ్ఞా పాటవాలు అసామాన్యమైనవి. ఆయన చలనచిత్రాలలోనే కాక ప్రైవేటుగా యిన్ని లలిత గీతాలు, పద్యాలు ఆలపించారని నేటి తరంలో చాలామందికి తెలియదు. వారు పాడిన చిత్ర గీతాలు మాత్రమే అందరికీ తెలుసు. ఆయన పరమపదించినప్పటి నుంచి గాయనీగాయకులందరూ ఆయన చిత్రాలలో పాడినవీ, స్వరపరచినవీ ఎక్కువగా పాడుతూంటారు.
మరి ఘంటసాల గారి చిత్రేతర భక్తిగీతాలు, పద్యాలు, యక్షగానాలు, బుఱ్ఱకథలు, అష్టపదులు, లలితగీతాలు మున్నగువాటి గురించి యీ తరం వారికి అందించాలనే సత్సంకల్పంతో డా. కె.వి.రావుగారి రూపకల్పనతో సంగీత సాహిత్యాలలో విద్యన్మణులు శ్రీ డా.ఎం.పురుషోత్తమాచార్యుల వారు సమతుల్యమైన విశ్లేషణతో రూపొందించిన 'మన ఘంటసాల సంగీత వైభవం' అనే బృహద్గ్రంథమిది. ఆచార్యులవారు ప్రతిపాటలోని వివిధ సాహిత్య సంగీత అంశాలను అత్యంత సునిశితంగా పరిశీలించి మధురమైన వ్యాఖ్యానంతో ఎన్నో విషయాలను వివరంగా హృద్యంగా పొందుపరిచారు. - మహాభాష్యం చిత్తరంజన్