సామాజిక జీవనంలో అంతర్భాగమైన చరిత్ర-సంస్కృతికి గల మూలాల్ని సాకల్యంగా అర్థం చేసుకోడానికి ఉపకరించే విలువైన రచన ఇది. కులం, మతం, పండగలు, పూజలు, దేవాలయ సంస్కృతికి సంబంధించిన అనేక అంతర్గత వాస్తవాల్ని గుర్తింపజేయడం ఇందులోని వ్యాసాల విశిష్టత. ఏ విషయాన్ని నమ్మాలన్నా కార్యాకరణ సంంధం కీలకం. ఇది శాస్త్రీయ వివేచనకు ఆధారం. దీనిని భూమికగా చేసుకొని రాసిన ఈ వ్యాసాల పరంపర మన నమ్మకాల వ్యవస్థని ప్రశ్నలకు గురి చేస్తున్నది. వినాయక చవితి, నాగుల చవితి, వరలక్ష్మీవ్రతం, దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండగల్ని ఘనంగా చేసుకునే వారి ముందు అనేక ప్రశ్నల్ని ఉంచుతాయి. ఈ పండగల వెనుక ఉన్న అసలు కథ ఏమిటో వివరిస్తాయి. మన చరిత్ర, సంస్కృతులకీ, ఈ పండగలకీ అసలు ఎలాంటి సంబంధం ఉన్నదో విశదం చేసి విస్తుపోయేలా చేస్తాయి ఈ వ్యాసాలు. ఆర్యుల రాకపూర్వమే ఈ దేశంలో బలంగా ఉన్న జీవన విధానాలు, మూలవాసీ సంస్కృతుల్లోని మానవీయ కోణాల్ని చూపుతాయి. మహిళలు జరిపే పండగల్లోని సారాన్ని, సారాంశాన్ని స్త్రీల దృష్టికోణంతో చర్చకె పెడతాయి. ఈవిధంగా అనేక విస్మయాలకీ, విచికిత్సలకీ లోను చేసే శైలజ బండారి వ్యాసాలు పాఠకుల ఆలోచనా పరిధిని విస్తరిస్తాయి. మనకు తెలియని అనేక భిన్నకోణాల్ని దర్శింపజేస్తాయి. - పాలపిట్ట బుక్స్
పేజీలు : 160