రాజుగారి పేర్లు, తారీఖులు, జయాలు, అపజయాలు మాత్రమే ప్రధానంగా వ్రాసిన చరిత్ర చదవటంలో అందరికి ఆసక్తి ఉండదు. కాని చరిత్ర అంటే అందరికి చెందిన గత కాలపు సమాచారము. అందువల్ల అందరికి ఆసక్తికరంగా పాఠకరుచిని తీరుస్తూ చరిత్ర వ్రాయటం అవసరం. అందులో జనశ్రుతి గాథలు, వాస్తవాన్ని ఆకర్షణీయంగా చేయడానికి పుట్టిన కథలు అన్నీ జాతి చరిత్రలో భాగాలే. అవన్నీ కలిపి కట్టిన కథే ''మన అమరావతి కైఫియతు''. వాస్తవ సమాచారము, దానిపై అల్లిన అందమైన కల్పనలే కైఫియతు అంటే.
అమరావతి నిర్ధిష్ట భౌగోళిక ప్రాంతమే అయినా ఈ మాగాణంలోనే మన సమిష్టి సంస్కృతి పండటానికి నారుమడి పోసింది ఆంధ్రజాతి. పోసిన నారు అంతా పంటకు రాకపోవచ్చు. కలుపు అధికం కావచ్చు. అది సరిచేయటం రాజ్యపాలక కృషీ వలులది.
ఇప్పుడు మన నూతన రాజధాని ''అమరావతి'' కావటంతో నాటి శాతవాహనులకే పరిమితమైన రాజధాని నేడు అందరికి చెందింది. అందుకు నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనసారా అభినందిస్తూ ఈ ప్రాంత గతాన్ని అందరకూ తెలియచెప్పటానికి ఈ పుస్తకం ప్రయత్నిస్తున్నది.