ఈ నవల ఇతివృత్తానికి కేంద్రం : మన పల్లెటూళ్ళు. పల్లెటూళ్ళు తమ రూపురేఖల్ని మార్చుకొని, ఎలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్నాయో శుక్తిమతిగారు చాలా వివరంగా, వాస్తవికంగా, స్వానుభవంతో ఈ నవలను రచించారు. ఈ రచన వెనుక శుక్తిమతి చేసిన ఎంతో పరిశోధన ఉంది. ఎంతో శ్రమ ఉంది. పల్లెటూర్ల మీద ఆమెకు అపారమైన ప్రేమ ఉంది. తను పుట్టి పెరిగిన గ్రామం మీద ఆమెకు అవ్యాజమైన అభిమానం ఉంది. తను పుట్టి పెరిగిన గ్రామాన్ని ఒక త్రాటిపై నడిపించాలనే సహృదయుడైన రామయ్య ఈ నవలలో ఒక ముఖ్య పాత్ర. రామయ్య తరం వాళ్ళంతా ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటూ ఎంతో సఖ్యతతో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తుంటారు. కానీ మారుతున్న తరంతోపాటు ఆ ఊరిలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. క్రమంగా ఆ ఊర్లో అనేక అనారోగ్యకరమైన మార్పులు సంభవించి ఆ గ్రామ జీవితాన్ని నరకప్రాయంగా మార్చేస్తాయి. ఇలా ఆ ఊర్లో చోటుచేసుకంటున్న ఈ మార్పులన్నింటిని రచయిత్రి ఎంతో నేర్పుతో మన కళ్ళముందుంచారు. ఈ నవలలోని పాత్రల్లో చంద్రం పాత్రను ఇప్పటి కొత్తతరానికి ప్రతినిధిగా రచయిత్రి రూపొందించారు. ఎంతో ప్రశాంతంగా ఉంటున్న ఈ గ్రామంలో చంద్రం అనేవాడు తుఫానును సృష్టించి, అక్కడి మానవ సంబంధాలను కలుషితం చేస్తాడు. చంద్రం భార్య సీతాలు మౌనంగా చంద్రం దౌర్జన్యాన్ని భరిస్తుంటుంది. ఆమెకున్న ఒకే ఒక కోరిక : తన కొడుకును బాగా చదివించుకోవటం. చంద్రంలాంటి వాళ్ళ కారణంగా ఆ ఊరిని వదిలిపెట్టి పట్టణాలకు వెళ్ళిపోయిన వాళ్ళంతా రకరకాలుగా నష్టపోతున్నారు. ఈ నవలలోని పాత్రలన్నీ ఎంతో సజీవంగా మనం మన నిత్యజీవితంలో రోజూ చూసే, మన చుట్టూ ఉండే మనుషుల్లాగే కనిపిస్తారు. ఈ వాస్తవికతే ఈ నవలకు ప్రాణం. - అంపశయ్య నవీన్‌

పేజీలు : 184

Write a review

Note: HTML is not translated!
Bad           Good