గాంధీజీ పేరు చెప్పేసరికి - సత్యము, అహింస, అనే మాటలతో బాటుగా ఆ రెండింటి సమన్వయంగా వెలువడిన సత్యాగ్రహము అనే మాట కూడా జ్ఞాపకానికి వస్తుంది. మనుషులలోని పరపిడనా ప్రవృత్తిపై మహాత్ముడు ప్రయోగించిన అహింసాత్మక ఆయుధం ఇది.
'సత్యాగ్రహం' అనే మాట చాలా మందికి సుపరిచితం కావచ్చునుగాని, ఈ మాటకుగల సంపూర్ణమైన అర్ధం ఏమిటి? దీనిని గాంధీజీ తొలిసారిగా ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఉపయోగించారు? గాంధీజీ భారత్ లో మొత్తం ఎన్ని సత్యాగ్రహాలు చేశారు? వాటి ఫలితం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు చాలా మందికి తెలియవు.
తెలుగులో కొంత గాంధేయ సాహిత్యం వుండవచ్చుగాని ఈ విషయాలకు సంబంధించిన సంపూర్ణమైన అవగాహనకు అవి తొడ్పడవు. మొత్తం భారతదేశ స్వాతంత్ర్య చరిత్రనూ ఏకరువు పెట్టడం వేరు. సత్యాగ్రహ సమరాన్ని వాటి లక్ష్యాలతో సహా, పరిణామాక్రమంతోసహా, వివరించడం వేరు. అవన్నీ గాక గాంధీజీ లక్ష్యం కేవలం ఒక దేశానికి స్వాతంత్ర్యం తేవడం ఒక్కటేకాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకోవాలి. ఆయన కోరేది కేవలం స్వరాజ్యం మాత్రమే కాదు. ఆ స్వరాజ్యం సురాజ్యంగా వుండాలని ఆయన కోరుకున్నాడు.
దక్షిణ ఆఫ్రికాలోనయినా, భారతదేశంలోనయినా, ప్రపంచ పౌరుడయిన మహాత్ముని దృష్టి ఒక్కటే. అన్నిదేశాలూ సురాజ్యాలుగా వుండాలనీ, మనుషులందరూ ప్రేమాభిమానాలతో విలసిల్లాలనీ ఆయన కోరుకున్నాడు. అదేకాకుంటే దేశదేశాలకూ ఆయన ఆలోచనలు ఆత్మీయమయ్యేవి కావు. నేటికి స్పూర్తినిచ్చేవికావు.
ఈ విషయాలన్నింటినీ దృష్టిలో వుంచుకుని ముఖ్యంగా యువతరం కోసం ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. విలువలు సన్నగిల్లుతున్న ఈ రోజులలో జనావళికి సరి అయిన లక్ష్యం సమకూరెందుకు, వారిలో పోరాటపటిమ సరి అయినరీతిలో వుండేందుకు, గాంధీజీ గురించి తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకం. --- కోడూరి శ్రీరామమూర్తి

Write a review

Note: HTML is not translated!
Bad           Good