పొద్దు పొడుపుతో ప్రారంభమై, అబ్దుల్లా కుతుబ్‌షా, హయత్‌ బక్షీ బేగం, షాజహాన్‌ ఫర్మానా లేపిన కలకలం, హనుమకొండలో భానూజీ ఇల్లు, ఆయన కొడుకు మాదన్న, మాదన్న బాల్యం, చదువు సంథ్యలు, హైదరాబాదులో షరాఫ్‌గా ఉద్యోగంలో చేరి, ఒక్కొక్క మెట్టెక్కుతూ 'మీర్‌ జుమ్లా' పదవినంది, రాజ కుటుంబంలో ఒకడిగా మెదిలి, చివరకు దుష్ట పన్నాగానికి బలై అశువులు బాశాడు. ఇంత క్లుప్తంగా మాదన్న మంత్రి చరిత్రను చెప్పుకోగలిగాం గానీ, నవల నడచిన తీరు, ఘటనలూ, సంఘటనలూ చదివే కొద్దీ, చదివింపజేయటమే కాక, ఆ సంఘటనల పదఘట్టనలు మనకు వినిపిస్తాయి ఈ నవలలో.- డా. ఈమని శివనాగిరెడ్డి - స్థపతి

'ధనసంపాదన కోసమే చదువులు' అనుకుని పరుగులు పెడుతున్న నేటి సమాజంలో యువతకు ఇలాంటి సాహిత్య పఠనం కొంత సామాజిక బాధ్యతను, వారసత్వ సంపద పట్ల గౌరవాన్ని పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా వాస్తవాలకు ప్రతిరూపంగా రూపొందిన ఇలాంటి సాహిత్యం ప్రతి ఇంట్లో ఉండాలి. ఆయా కుటుంబాల అభిరుచులకు, సంస్కారానికి అవి అద్దం పడతాయి.  - హైమవతి చరిత్ర ఆచార్యులు కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌

నవలలోని సాహితీ విలువలు - భాష, శిల్పం, శైలి, కతనం మొదలైనవాటి చర్చకి ముందుమాట వేదిక కాదు. అయితే అనుమానానికి తావు లేకుండా ఒక్క విషయం చెబుతాను. ''మహామంత్రి మాదన్న'' విడవకుండా చదివిస్తుంది. చదువుతున్నంతసేపూ కళ్ల ముందు కదులుతూనే వుంటుంది. తరువాత మనసులో మెసులుతూనే వుంటుంది. కొమరం భీం, మలగని బత్తి, రుద్రమదేవి లాంటి ఆకట్టుకునే చరిత్ర ఆధారిత నవలలు రాసిన ప్రాణ్‌రావుగారి కలం నుంచి జాలువారిన 'మహామంత్రి మాదన్న' పై నవలలకి ధీటుగా వుంది. - డా|| రావుల సోమారెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good