తెలుగు సాహిత్యంలో బడుగు వర్గాల జీవితాలకు భాష్యం చెప్పే చరిత్ర రూపుదిద్దుకుని దాదాపు వంద సంవత్సరాలయింది. అలనాటి కరుణకుమార, ఉన్నవ లక్ష్మీనారాయణ, అడివి బాపిరాజు తొలి గొంతులయితే వారి జీవుని వేదననూ, ఆశలనూ, ఆశయాలనూ కళాత్మకం చేసిన కళాదర్శకుడు మాధవపెడ్డి గోఖలే. కళాదర్శకుడు అనడం గోఖలే విషయంలో అక్షర సత్యం. అక్షరాలను అద్భుతమైన చిత్రాలుగా మలిచిన అపూర్వ చిత్రకారుడు గోకలే. ఆయన చేతిలో కలాన్ని కుంచెను చేసి, కుంచెను కళగా మలిచి ఈ జాతి సంప్రదాయ వైభవాన్ని వెండితెరమీదా, కాగితం మీదా ఆవిష్కరించిన మహాకళాకారుడు గోఖలే. ఈ రెండూ రెండు విభిన్నమయిన పార్శ్వాలు. రెండు విలక్షణమైన ప్రవృత్తులు. గోఖలే సాధికారికంగా అధ్యక్షత వహించిన రెండు విభిన్నమయిన ధోరణులు.

ఆయన చిత్రాలు, కథలు, వ్యాసాలు, నాటికా - వీటన్నింటినీ ఒక్కచోట చేర్చి చరిత్ర భుజం మీద చెయ్యి వేసి నడిపించిన అపూర్వ భగీరధుడు - ఈ పుస్తక ప్రచురణకర్త మల్లాది సచ్చిదానందమూర్తి గారు. ఆయన కృషిని ఇలా అక్షరబద్ధం చేసిన మరో ఇద్దరున్నారు. అభిరుచి వారి ఇంటిపేరు. అభినివేశం వారి చిరునామా, వారే క్రియేటివ్‌ లింక్స్‌ పబ్లికేషన్స్‌ సూరిబాబు, శ్రీకాంత్‌. తెలుగు సాహితీ ప్రపంచం చేసుకున్న అదృష్టం పేరు - ఈ పుస్తకం. - గొల్లపూడి మారుతిరావు 

Write a review

Note: HTML is not translated!
Bad           Good