యమునా తీరంలో సంధ్యా సమయాన వేయి కన్నులతో రాధ ఎదురు చూసిందట, ఎందుకో?

యుగ యుగాలనాటి రాధ మాదిరే, శారద, ఆ ప్రశాంతమైన సంధ్య వేళ సువిశాలమైన సముద్రపుటంచున క్షణ మొక యుగంగా నిరీక్షిస్తూ కూర్చుని వుంది. చేతిలో పుస్తకం తెరిచి పెట్టుకోవటమే గాని ఆమె మనస్సు చదువు మీద లగ్నం కాలేదు. క్షణానికోసారి తల తిప్పి దారిపొడుగుకూ దృష్టిసారించి చూసి నిరాశపడుతోంది.

మరొకసారి వాచీ చూసుకొని తిరిగీ విరిగిపడే కెరటాలలోకి చూడసాగింది. అనంతమైన ఆ జలరాశి, విసిగిన ఆమె మనస్సుని అమితంగా ఆకర్షించింది. కెరటాలను మించిన భావాలు ఆమె మనసులో అల్లకల్లోలంగా చెలరేగాయి. ప్రకృతి సౌందర్యం అంతులేనిది. అనంతమైన ఈ నీటి రాశిని ఎవరు పోగుచేశారు? సదా చంచలించే ఈ కెరటాలను ఎవరు సృష్టించారు? నీటి రాశికి నెల రాజుతో చిత్రమైన అనుబంధాన్ని ఎవరు ఏర్పరిచారు? మహోన్నతమైన ఈ సౌదర్యమంతా ఎవరు సృష్టించారు? - సమాధానాలు రాని సందేహాలు కలిగినప్పుడల్లా మానవుడు భగవంతుణ్ణి విశ్వసించక తప్పదేమో!...

Write a review

Note: HTML is not translated!
Bad           Good