క్షమయా ధరిత్రి'! చాలా ఉన్నత భావవ్యక్తీకరణాన్నిచ్చే పేరు - కథాసంపుటికి స్వీకరించి, తమ సంస్కార భావనకీ ప్రతీకని చేశారు రచయిత్రి. ఈ పేరు - స్త్రీ మూర్తికి ప్రతీక. ఆమె సహనానికీ, ప్రవృత్తికీ, ప్రకృతికీ, స్వభావానికీ, నవ్య నవనీత సమాన హృదయ స్వచ్ఛతకీ - ఆవిష్కరణ! అందుకే, ఆ పదంలో అంతటి ఆర్ధ్రతా, ఆప్యాయతాస్పర్శ!

రచయిత్రికి కథని చెప్పటంలో సరళమైన 'జాలు' వుంది. కథ ఎప్పుడూ వస్తుస్పర్శ మీద సాగుతుంది. ఇతివృత్తాన్ని వెల్లడించటం మీదే 'ఫోకస్' వుంటుంది. కథలో ఆధునిక కథానిక ప్రక్రియలో, వస్తువుతోపాటు శిల్పం ప్రాధాన్యత వహిస్తుంది. అందుకనే, పోరంకి వారన్నట్లు - కథ ముడివజ్రమైతే, కథానిక సాన బెట్టిన వజ్రం! కథ, కథానిక - ఈనాడు సమానార్థం ప్రతిపాదకాలై సాగుతున్నాయి.

పాఠకుణ్ణి 'ఉన్న' స్థితి నుంచీ మానవీయంగా 'ఉన్నత' స్థితికి నడిపించేందుకు ప్రోద్బలించే కథలూ, కథానికలూ కూడా ఆహ్వానించదగినవే!

Write a review

Note: HTML is not translated!
Bad           Good