'ఆధునికాంధ్ర సాహిత్యంలో అసాధారణ ప్రతిభావంతుడైన రచయిత శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. అట్టివారి రచనలు లోకానికి త్వరగా సమగ్రంగా అందాలి. ఆ ప్రయత్నంలో సంకీర్ణ వ్యాసాలు, సాహిత్య ప్రసంగాలు, యక్షగానాలు, శ్రవ్యనాటికలు, గేయాలు, ఖండకావ్యాలు క్రమంగా ప్రకటితం కావడం ఆంధ్ర సాహిత్య ప్రియులకు ఎంతైనా హర్షదాయకమనుకుంటాను'' అన్నారు శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి 1-10-65న  విశ్వోదయ ప్రచురణలకు 'రెండుమాటలు' వ్రాస్తూ. ఆనాటి ఆయన ఆశయం నేడు కార్యరూపం ధరిస్తున్నది. అందులో భాగంగా విడుదలయింది కృష్ణశాస్త్రి సాహిత్యం - 5 వ్యాసావళి - వ్యాసాలు. ఇందులో - కవిపరంపర - కవితా ప్రశస్తి - మహా వ్యక్తులు - అప్పుడు పుట్టి ఉంటే - పుష్పలాలికలు - బహుకాల దర్శనం - అమూల్యాభిప్రాయాలు ప్రకరణలున్నాయి. ఇందులో మొదటి ప్రకరణం 'కవిపరంపర' విడివిడికవుల కవితా విశిష్ట లక్షణాలను వివరించేది.
తొలిచి చూసి, లోపల దాగి ఉన్న సౌందర్యాన్ని పెల్లగించి చూచే కృష్ణశాస్త్రి గారి కవిచూపు సునిశితమైన సాహిత్య విమర్శకుని చూపు కూడా అని ఈ 'కవిపరంపర'లోని దిగువ ఉదాహరించిన వాక్యాలు స్పష్టం చేస్తున్నాయి.
''నన్నయ వైకుంఠాన్ని భూలోకంలో అవతరింపజేస్తాడు, తిక్కన్న భూలోకాన్ని స్వర్గం దగ్గరకు ఎత్తడానికి ప్రయత్నిస్తాడు.''
''శబ్ధం పలకడమే కాదు, పాడుతుంది''.
''ఏడెనెమిది వందల ఏళ్ళ నుండి పల్లెల్లో, పట్టణాల్లో, ఇళ్ళల్లో, రచ్చ చావళ్ళలో ఈ భారతం చదువుకుని పురాణంగా చెప్పి తెనుగు వారు తమ జీవితంలో కలిపేసుకున్నారు. తిక్కన్న రచనలో అంత జీవచ్ఛక్తి, చైతన్యం ఉన్నాయి''.
''వారు (తిరుపతి వేంకట కవులు) గొప్ప కవులు, అయితే పద్యకవిత్వం కన్నా వారి వచనం గొప్పదని నా నమ్మకం''.
కవిగా, వక్తగా, భావకవిత్వోద్యమ జయస్తంభంగా, భక్త కవిగా, సినీ కవిగా శ్రీ కృష్ణశాస్త్రిని గుర్తించినంతగా సాహిత్య విమర్శకుడిగా ఆయన్ను లోకం గుర్తించినట్టు లేదు. దేశంలో నవ్య సాహిత్యోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లోనే ఆయన చేసిన రేడియో ప్రసంగాలు ఇంతవరకూ గ్రంథరూపం దాల్చకపోవడమే ఇందుకు కారణం. ఇదిగో - ఇపుడీ సంపుటం ఆ లోపాన్ని పూరిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good