ఈ సంపుటిలోని వన్నీ గేయాలు. కృష్ణశాస్త్రి గారి గేయాలు. గేయాలు అంటే పాడదగినవి, లేక పాడవలసినవి. కృష్ణశాస్త్రి గారిని గురించి తెలిసున్న ప్రతి ఒక్కరూ ఈ సంపుటిలోని గేయాలలో కొన్నిటినో, అన్నింటినో ఎవరో ఒకరు పాడగా వినే ఉంటారు. పాటలుగా వింటే తప్ప వీటిలోని అందచందాలు పూర్తిగా అర్దం కావు.
వీటిని ఖండ కావ్యాలుగా చదువుకోవచ్చు. వీటిలోని కవితా మాధుర్యాన్ని, పలుకుబడులలోని వైచిత్రిని, పదచిత్రాల వైశిష్ట్యాన్ని, భావసౌకుమార్యాన్ని మెచ్చుకోవచ్చు. అయితే ఇవి చదువుతున్నప్పుడే వీటిలో అంతర్భూతంగా ఏదో సంగీతం ఉందనిపిస్తుంది. పాడుకోవాలనిపిస్తుంది. గొప్ప వాగ్గేయకారుల ప్రత్యేక అక్షణం అది.
అన్నమయ్య, త్యాగయ్య వంటి వాగ్గేయకారుల షశీఎజూశీరఱ్‌ఱశీఅర లో కవితా శిల్పం కన్న, గాన శిల్పానికి ప్రాధాన్యం ఎక్కువ. అన్నమయ్య, త్యాగయ్య కృతులను చదువుతున్నప్పుడు వాటిలో కొన్ని కవిత్వ దృష్ట్యా పేలవంగా అనిపించవచ్చు. పాడుతున్నప్పుడు ఆ పదాలకే మరొక పరిణామం. మరొక లోతు. గాంభీర్యం సంక్రమిస్తుంది. హృదయాన్ని కదిపే శక్తి వస్తుంది. కృష్ణశాస్త్రి గేయాలు అన్నీ తీర్చిదిద్దిన ఖండకావ్యాలు. వాటిలో కవితా శిల్పం కొరవడదు. ఊరికే చదివినా పేలవంగా అనిపించవు.
పండితులు, విమర్శకులు ఒక కవి రచనలలోంచి ఏదో ఒక తాత్త్విక సూత్రాన్ని పిండడానికి ప్రయత్నించడం జరుగుతుంది. వారికి ఈ గేయ సంపుటి ఒక గడ్డు సమస్య అయిపోయింది. ఇందులో ఎన్నో భగవానుణ్ణి ఉద్దేశించిన గేయాలున్నాయి. ఒక్కొక్కప్పుడు ఆయన పిలిచే భగవానుడు నిర్గుణాకారుడు. ఒక్కొక్కప్పుడు స్పష్టమైన మూర్తితో సాక్షాత్కరించే కృష్ణుడో, శివుడో ! అంతే కాదు. ఒక్కొక్క గేయానికి ఉన్న భక్తులలో కూడా ఎన్నో భేదాలున్నాయి. ఒక గేయంలో సూఫీ తత్త్వజ్ఞుడు పరదైవతాన్ని గురించి పాడతాడు. మరొక్క గేయంలో భక్తుడు దీనుడు. ఇంకొక్క గేయంలో భగవంతుణ్ణి ఆప్యాయంగా అపహసించే సామాన్యుడు. భగవత్‌ స్వరూపాన్ని ఈ విధంగా దర్శించే రకరకాల భక్తులుగా కవి మారిపోతాడు. ఒక్కొక్క భక్తుడు కృష్ణశాస్త్రి ఒక్కొక్క అవతారం. అందువల్ల కృష్ణశాస్త్రి దృష్టి ఏదో ఎవరికీ అందదు.
ఆయన 'నేను మానవతావాదిని', 'వట్టి హృదయవాదిని' అని అంటుండేవారు. అందుకే ఆయన ప్రతి గేయంలోనూ గుండె పలుకుతుంది - మనిషి గుండె - విరాట్‌ స్వరూపం దాల్చిన మనిషి గుండె!

Write a review

Note: HTML is not translated!
Bad           Good