రాజ్యము, దానికి చెందిన వివిధ అంగాల్ని గూర్చి ప్రాచీన భారతీయులకున్న దృక్పథాన్ని, దాని స్వరూప స్వభావాల్ని, దాని పరిణామ క్రమాన్ని తెలుసుకోవడం నేటి రాజకీయ, ఆర్ధిక పరిస్ధితుల్లో అత్యంత అవసరం. ఆధునిక విజ్ఞానమంతా మన పురాణాల్లోనే వుందనే భావాత్మక సిద్ధాంతాన్ని విశ్వసించేవారు నేడు దేశాన్ని పరిపాలించే స్ధితికి వచ్చారు. దేశంలోని కుల, మతాలు సహజసిద్ధమని, ఇతర మతాల్లో వున్నవారంతా హిందూమతం వారేనని తిరిగి తమ పాత మతంలోకి అందులో భాగమైన కులంలోకి రావాలని వీరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో ప్రాచీన భారత సమాజాన్ని, ఆ వ్యవస్థను నడిపిన రాజ్యాంగయంత్ర పరిణామాన్ని గురించి తెలుసుకునేందుకు సి.వి. (చిత్తజల్లు వరహాలరావు)గారు రచించిన ''కౌటిల్యుని అర్థశాస్త్రం పూర్వాపరాలు'' పుస్తకం తప్పనిసరిగా చదవాల్సిందే. భారతదేశంలో వివిధ దశల్లో మానవ జీవనం, పాలకుల, పీడితుల స్థితిగతులు, రాజ్యం పాత్ర గురించి ఈ పుస్తకం ద్వారా వివరంగా తెలుసుకోగలం. చరిత్రను నిష్పక్షపాతంగా అధ్యయనం చేయాల్సిన వారికి మహత్తరమైన శాస్త్రీయ ఆయుధం చారిత్రక భౌతికవాద సిద్ధాంతం. సి.వి. గారు ఈ గ్రంథంలో ఆ ఆయుధాన్ని సమర్థవంతంగా వినియోగించారు. రాజ్యమనేది సర్వజనుల ఆమోదంతో సకలజనుల ప్రయోజనాలకోసం ఏర్పడింది కాదని దానికొక వర్గ స్వభావం వుందని రచయిత సులభశైలిలో వివరిస్తాడు. కౌటిల్యుని అర్థశాస్త్ర గ్రంథం కంటే ముందే భారతదేశంలో రాజనీతి సిద్ధాంతాలు వున్నాయని, అవి ఆనాటి ఉత్పత్తి విధానానికి అనుగుణంగా మార్పు చెందుతూ వచ్చాయని ఇందులో గ్రహించవచ్చు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good