ఏకకాలంలో నాలుగు భిన్నమైన అంతర్గత సంబంధం కలిగిన ప్రజా ఉద్యమాలతో ఆయన జీవితం ముడిపడి వుంది. అవి నిజాం వ్యతిరేక పోరాటం, వెనకబడిన కులాల ఉద్యమం, చేనేత, సహకార ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.

నియంతృత్వ భూస్వామ్య నిజాం పాలనకు వ్యతిరేకంగా యువకార్యకర్తగా బాపూజీ రాజకీయ జీవితం ఆరంభమైంది. సామాజిక మూలాలు వీడని ప్రజా రాజకీయ పార్శ్వాన్ని ఆయన రాజకీయ దృక్పధం ప్రతిబింబించింది. ప్రజాస్వామ్య రాజకీయాలలో అంతర్భాగంగా భావించే వెనుకబడిన కులాల ఉద్యమానికి ఈ దృక్పథమే ప్రాతిపదిక.

తెలంగాణా రాష్ట్ర సాధనోద్యమానికి ఏకనాయకత్వం పనికి రాదని సమిష్టి నాయకత్వం మాత్రమే ఆశయ సిద్ధికి దోహదం చేస్తుందని నమ్మి వక్కాణించిన బాపూజీ తన ఆశలన్నీ విద్యార్థులు, యువజనులపైనే పెట్టుకున్నారు. ఉద్యమానికి వారే సారధ్యం వహించాలని కోరుకునేవారు.

    చేతివృత్తులు, సేవా వృత్తులు, వ్యవసాయం చేసే కులాలతో కూడిన వెనుకబడిన తరగతుల జీవనోపాధికి సంబంధించిన అవసరాలు తీర్చే వ్యవస్థాగత విధానాలకోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ఉద్యమంగా వెనుకబడిన కులాల ఉద్యమం మన దేశంలో రూపుదిద్దుకుంది. చేనేత మగ్గాల యజమానులు, వ్యాపారుల ప్రయోజనాలు, నేత పనివారల ప్రయోజనాలు ఒకటి కాదనే గ్రహింపు ఆయన సాగించిన ఉద్యమాన్ని అట్టడుగు శ్రేణులకు చేరువ చేసింది.

వెనుకబడిన తరగతుల శ్రేయస్సు కోరి బాపూజీ, గౌతు లచ్చన్నల తరం ఆచరణలో పెట్టిన ప్రజారాజకీయాలు, ఈనాటి వెనుకబడిన కులాల నేతల రాజకీయ ఆచరణకు పూర్తిగా భిన్నమైనవి. వెనుకబడిన తరగతుల ఉద్యమాలు ఈ రోజున కేవలం రిజర్వేషన్ల సాధనకు పరిమితమైపోయి, రాజకీయాలను ఎన్నికల అంకెల గారడీకి కుదించివేశాయి. ప్రజల జీవనోపాధి మీదగానీ, వారి ఆర్థిక భద్రత మీదగానీ ఈ ఉద్యమాలకు కించిత్తయినా ఆసక్తి లేకపోవడం గమనార్హం.

నయా ఉదారవాదానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ఆర్థిక నమూనా ప్రాతిపదిక ద్వారానే ప్రజల మధ్య ఐక్యత సాధ్యమౌతుందని బాపూజీ నమ్మారు. ఆచరించారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good