సర్రున కారువచ్చి ఆగింది. కారులోంచి కోనంగి దిగాడు. దిగీదిగడం తోనే కారు డ్రైవరుకు కుడివైపున ఉన్న అద్దంలో ఎందుకైనా మంచిదని తన్ను చూచుకుంటూ కోటు మడతలు సరిచేసుకున్నాడు. టై సర్దుకున్నాడు. చేతికర్ర వయ్యారంగా పట్టుకొని ఒకమాటు తల ఇటూ, ఓమాటు అటూ తిప్పుకొని ''దిగ్విజయీభవ!'' అని మనస్సులో అనుకొని ఈ విజయదశమికి తనకు విజయం తప్పదనుకుంటూ, జాగ్రత్తగా కుడికాలు జాపి దూరముగా ఉన్న మొదటి మెట్టు పై వేలువైచి పడబోయినంతపని అయి కర్రతో ఆపుకొని, పది సెకండులు మెట్టుమీదే ఆగి, రెండవమెట్టు, మూడవమెట్టు, నాల్గవ అయిదవ మెట్టులు కుడి పాదం వేస్తూనే ఎక్కి ఆ భవనం ముందర వరండాలో ఆగాడు. ఆగినాడంటే మామూలుగా ఆగినాడా ?
ఒక మహారాజు కొమరుడు వేరొక మహారాజు ఇంటికి వచ్చినట్లే! ఆ వచ్చిన కారు తనదే అయినట్లు! ఏమో, ఈ సంబంధమే కుదిరితే ఈ కారు తనది ఎందుకు కాకూడదూ ?
అదృష్టం పెళ్ళివల్ల పట్టాలి ! బంగారపు పాదాలతో పెళ్ళికూతురు పెళ్ళికుమారుని దగ్గరికి నడచి వచ్చిందనుకొండి. అప్పుడు లక్ష్మి నీ దగ్గరకు వచ్చినట్లే కాదటయ్యా ! నీ మామగారు వట్టి పాల సముద్రుడా ? ఇంగ్లీసు అయిషైరు ఆవుపాలసముద్రుడు గాని !
కుదిరితే ధనంవున్న పెళ్ళికూతురే కుదరాలి; అయితే ఐ.పి.ఎస్‌. ఉద్యోగమే అవ్వాలి అని కోనంగి దృఢనమ్మకం.
ఇంతలో కోనంగిరావుగారి దగ్గరకు ఒక చప్రాసీ పరుగెత్తుకొని వచ్చి, వంగి నమస్కారాలు చేసి లోనికి దయచేయండని అక్కడ ఉన్న ఒక సోఫాపై అధివసింప చేశాడు.
ఇంతకీ కోనంగికి ఆ సంబంధం కుదిరిందో, లేదో! ఆ కారు అతనికి స్వంతమైందో, లేదో ఎలా తెలుస్తుంది ? ఏం ప్రశ్న అది ? శ్రీ అడివి బాపిరాజు గారి సాంఘిక నవల కోనంగి చదివితే తెలుస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good