ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్‌, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషనాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణనీయమైన సాహిత్యాన్ని సృజించిన తెలుగు రచయితలలో కుటుంబరావుది అగ్రస్ధానం.  ఆ రచనా ప్రపంచం రాశిలోనే కాక, వాసిలోనూ, వస్తు శిల్పాలలోనూ, శైలిలోనూ, పాఠకుల ఆలోచనలను ప్రేరేపించడంలోనూ కూడా అసాధారణమైనది. ఆయన తన కాలపు సామాజిక జీవనంలోని చీకటి వెలుగులను వివరించారు. మధ్య తరగతి జీవితంలోని ఆనంద విషాదాలనూ, ఉదాత్తతనూ నీచత్వాన్నీ విశ్లేషించారు. ఆ వివరణ, వివ్లేషణ అన్ని కోణాల నుంచీ, అన్ని స్థాయిల నుంచీ లోతుగా సాగాయి. అలా పాఠకుల చైతన్యాన్నీ, అవగాహనలనూ ఉన్నతీకరించడానికి ఆయన చేసిన ప్రయత్నం అనితరసాధ్యమైనది. ఇందులో ఆయన రాసిన సైన్స్‌ వ్యాసాలు ఉన్నాయి.

''అమ్మో పదార్ధ విజ్ఞాన శాస్త్రమా? భూగర్భ శాస్త్రమా? ఖగోళశాస్త్రమా? రసాయన శాస్త్రమా? జీవశాస్త్రమా? వైద్య శాస్త్రమా? అవి మనకి కొరుకుడు పడవు'' అని జంకేవాళ్ళ వెన్నుతట్టి, వెన్నలా కరిగిపోయేటంత సులువుగా సైన్సుని మనకి అందించారు కుటుంబరావుగారు. సైన్సు సంగతులనీ, విశేషాలనీ; దేశ చరిత్రలు, పురాణాలు, మతాలు, రాజకీయాలు, ఆర్ధికం తదితర సామాజిక శాస్త్రాలు, సాహిత్యం వీటన్నింటితో జతపరిచి, విడమరిచి చెప్పారాయన. అందుకే ఇవి అంత ఆసక్తికరంగా వుంటాయి. మనని ఆకట్టుకుంటాయి, మనకి అర్ధమవుతాయి, మన మనసులో నాటుకుపోతాయి, మనకి కొత్త వెలుగు చూపిస్తాయి. జీవితంలోన్ని అన్ని రంగాలతో జోడించినప్పుడు మాత్రమే సైన్సు మరింత బాగా అర్ధమవుతుందని కుటుంబరావుగారు నిరూపించారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good