ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్‌, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషనాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణనీయమైన సాహిత్యాన్ని సృజించిన తెలుగు రచయితలలో కుటుంబరావుది అగ్రస్ధానం.  ఆ రచనా ప్రపంచం రాశిలోనే కాక, వాసిలోనూ, వస్తు శిల్పాలలోనూ, శైలిలోనూ, పాఠకుల ఆలోచనలను ప్రేరేపించడంలోనూ కూడా అసాధారణమైనది. ఆయన తన కాలపు సామాజిక జీవనంలోని చీకటి వెలుగులను వివరించారు. మధ్య తరగతి జీవితంలోని ఆనంద విషాదాలనూ, ఉదాత్తతనూ నీచత్వాన్నీ విశ్లేషించారు. ఆ వివరణ, వివ్లేషణ అన్ని కోణాల నుంచీ, అన్ని స్థాయిల నుంచీ లోతుగా సాగాయి. అలా పాఠకుల చైతన్యాన్నీ, అవగాహనలనూ ఉన్నతీకరించడానికి ఆయన చేసిన ప్రయత్నం అనితరసాధ్యమైనది.

సంస్కృతిని ఇంగ్లీషు భాషలో కల్చర్‌ అంటాం. కల్చర్‌ అనే మాట అగ్రికల్చర్‌ నుంచి వచ్చిందంటేనే దీని మూలం తెలుస్తుంది. జీవిత విధానానికి సంబంధించిందే కల్చర్‌. కాని ప్రజల భౌతిక జీవిత పునాది నుంచి సంస్కృతిని విడదీసి ప్రభువులు తమ దోపిడి కలకాలం కొనసాగించాలని కలలు కంటూ వుంటారు. ఆచరణ, అధ్యయనం, ఆసక్తి, పరిశీలన, విశ్లేషణ - ఇవి సంస్కృతికి దోహదం చేస్తాయి. కాని ఇవాళ వీటి స్ధానంలో, ముఖ్యంగా మన దేశంలో శుష్కవేదాంతం, ఆధ్యాత్మికత, అంధవిశ్వాసం, మతమౌఢ్యం పేరుకుపోతున్నాయి. వీటికి పరాకాష్ఠే బాబ్రీమసీదు కూల్చివేత (6 డిసెంబరు 1992). వీటి వికృత్స్యరూపమే వినాయక విగ్రహాల చేత పాలు తాగించడం (21 సెప్టెంబర్‌ 1995). ఇచ్ఛంగా అది సంకర సంస్కృతి (మిత్‌ + మిషన్‌). ఈ రెండు మిత్‌లు ప్రచారం చేయడానికి మిషన్లనీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని పాలకులు అదేపనిగా వాడుకున్నారు. దీనికే కుటుంబరావుగారు సంకర సంస్కృతి అని ఏనాడో పేరు పెట్టారు. ఇందులో ఆయన రాసిన సంస్కృతి  వ్యాసాలు ఉన్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good