ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్‌, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషనాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణనీయమైన సాహిత్యాన్ని సృజించిన తెలుగు రచయితలలో కుటుంబరావుది అగ్రస్ధానం.  ఆ రచనా ప్రపంచం రాశిలోనే కాక, వాసిలోనూ, వస్తు శిల్పాలలోనూ, శైలిలోనూ, పాఠకుల ఆలోచనలను ప్రేరేపించడంలోనూ కూడా అసాధారణమైనది. ఆయన తన కాలపు సామాజిక జీవనంలోని చీకటి వెలుగులను వివరించారు. మధ్య తరగతి జీవితంలోని ఆనంద విషాదాలనూ, ఉదాత్తతనూ నీచత్వాన్నీ విశ్లేషించారు. ఆ వివరణ, వివ్లేషణ అన్ని కోణాల నుంచీ, అన్ని స్థాయిల నుంచీ లోతుగా సాగాయి. అలా పాఠకుల చైతన్యాన్నీ, అవగాహనలనూ ఉన్నతీకరించడానికి ఆయన చేసిన ప్రయత్నం అనితరసాధ్యమైనది. ఇందులో ఆయన రాసిన రాజకీయ వ్యాసాలు ఉన్నాయి.

ఈ దేశం ఎవరిది? ఇది ఆర్యావర్తమేనా? ఆర్యులు ఇక్కడి వారేనా? ఎక్కడి నుంచి వచ్చారు? 'హిందూ' అనే శబ్దం మధ్య యుగాలకి ముందు ఉందా? ఇక్కడ ఎన్ని రకాల సంస్కృతులు విలసిల్లాయి? జ్ఞానం, శీలం, ఏకత అనేవి ఏకశిలా సదృశాలా? చారిత్రక సాంస్కృతిక రంగాల్లో జవాబులు రాబట్టవలసిన ఈ ప్రశ్నలు తాజాగా రాజకీయ రచ్చలోకి చొచ్చుకొని మరీ వచ్చాయి. అందువలన రాజకీయాలు మరింత రంజుగా ఉంటున్నాయి. ఈ ఉచ్చులోంచి ఇవాళ ఎవరం తప్పించుకోలేం. సంస్కృతిని గతం అనే చేటతో చెరిగి, మతం అనే జల్లెడతో జల్లిస్తున్నారు. ఇవాళ మన దేశంలో జరుగుతున్నవివే. కనక రాజకీయాలు, ఆర్ధికం పడుగూ, పేకల్లా పెనవేసుకుపోతాయి. ఈ రెంటినీ కలిపే చూడాల్సిన కృతకంగా విడదీయకూడదు. ఒకవేళ అలా విడదీస్తే జీవితం మరింత దుర్గమారణ్యంగా కనిపిస్తుంది. రాజకీయాలు నిత్యజీవితానికి సంబంధించినవి. అందాకా ఎందుకు? ఇవాళ తిండీ, బట్టా, ఇల్లు కూడా రాజకీయాలతోనే ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకి 'నేటి రాజకీయాలు' (అధ్యాయం 11)లో 'తిండి గింజలూ - పెట్రోలూ' అనే వ్యాసం చదవండి. 'అసలు అన్ని నాగరికతలకీ మూలమే తిండి గింజలు. ఆహార ధాన్యాలకు కీలకం అభివృద్ధి చెందిన దేశాలు. పెట్రోలుకి కీలకం వెనకబడిన దేశాలు. మానవజాతి 'మోటారుకారు' నాగరికత ద్వారా తప్ప పురోగమించదని ఎక్కడాలేదు...'మోటారు కారు' నాగరికత వేల సంఖ్యలో బలి తీసుకుంటున్నది...' ఇలాంటి కీలకమైన అంశాలెన్నిటినో కొడవటిగంటి కుటుంబరావు గారు ఈ వ్యాసంలో విశ్లేషించారు. ఇవాల రాజకీయం కానిదంటూ ఏమీ మిగల్లేదు. ఆ మాటకొస్తే మన పాలకులు మిగల్చలేదు. వాళ్ళ లెక్కల ప్రకారమే మన దేశంలో ముప్ఫై శాతం దారిద్య్రరేఖకి దిగువన ఉన్నారు. ఈ నేపథ్యం నుంచీ మాత్రమే ఈ వ్యాసాలు మనకి మరింత అర్ధవంతంగా కనిపిస్తాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good