కొడవటిగంటి కుటుంబరావు రచనలు చదివితే ఆధునిక తెలుగు సమాజం, సాహిత్యం కళ్ళక్కడతాయి. ఇరవయ్యో శతాబ్ది సాహిత్య సంచలనాలకి అద్దం పట్టిన కుటుంబరావుని అధ్యయనం చేయకపోతే తెలుగు సమాజ సాహిత్యాల పోకడ అర్థంగాదు.

కుటుంబరావు సాహిత్య ప్రక్రియలన్నింటిని సొంతం చేసుకున్నారు. 50 ఏళ్ళపాటు సుమారు అయిదు వందలకిపైగా కథలు, నవలలు, నాటికలు, గల్పికలు, కొన్ని వందల వ్యాసాలు రాసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. పదిహేను వేల పేజీల సాహిత్యం రచించారు కొడవటిగంటి కుటుంబరావు.

కథలు రాయడం చాలా తేలికయిన పని అని నిరూపించేందుకు విరివిగా కథలు రాశానని చెప్పుకొన్న కొడవటిగంటి కుటుంబరావు మధ్యతరగతి జీవితాలను కాచి వడపోశారు. మధ్యతరగతి జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలూ ఆయనకి రచనా వస్తువులయ్యాయి. గానుగెద్దుల్లాగా సంసార వలయాల్లో పడి తిరగాడే మధ్యతరగతి వాళ్ళలో సామాజిక చైతన్యం కలిగించిన తెలుగు రచయిత కొడవటిగంటి కుటుంబరావు. వ్యక్తులనే కాక రచయితలెందరినో ప్రభావితం చేయగలిగినవి ఆయన రచనలు.

సంఘంలో స్త్రీ ఎంత దయనీయస్ధితిలో వుందో స్పష్టంగా గ్రహించారు కొడవటిగంటి కుటుంబరావు. 'మన సమాజంలో కొందరు తక్కువ కులాల్లో పుడతారు. మరికొందరు ఆడవాళ్ళుగా పుడతారు' అన్న కొడవటిగంటి కుటుంబరావు స్త్రీ జీవితంలోని వివిధ దశల్నీ, వెనుకబాటుతనాన్నీ, గొప్ప ఆలోచనా పటిమనీ, పురోగామి దృక్పథాన్ని చాలా బాగా చిత్రించారు. కులోన్మాదాన్నీ, వైషమ్యాలని, పిల్లల పెంపకంలో మూర్ఖత్వాన్నీ, కళని రూపాయిల్లోకి మార్చుకునే వ్యాపార ధోరణినీ, డబ్బు కాటకం పరిస్ధితిలోని దైన్యాన్ని - ఇట్లా ఏ సమస్యనీ విడిచిపెట్టనంత విస్తృత పరిధిలో సామాజిక పరిస్ధితులని ఆయన కథలకి వాతావరణంగా వాడుకున్నారు. యువతరం కుటుంబరావుని చదివి సమాజాన్ని బేరీజు వేసుకోవడానికి ఇది మంచి అవకాశం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good