రాయలసీమ ప్రాతినిధ్య కథకుడుగా పేరొందిన విశ్వనాథరెడ్డి మార్క్సిస్టు కథకుడు. తను పుట్టి పెరిగిన ప్రాంత జీవితాన్ని చిత్రించడం, ప్రాతినిధ్యం వహించడం అనేది విశ్వనాథరెడ్డి రచనల గొప్ప లక్షణం.

స్త్రీల పట్ల, దళితుల పట్ల, పేదల పట్ల, శ్రామికుల పట్ల, కార్మికుల పట్ల, పీడితుల పట్ల, ఉద్యమాల పట్ల గౌరవాన్నీ, సంస్కారదృష్టినీ కలిగించడం విశ్వనాథరెడ్డి రచనాశయం. దోపిడీ పట్ల, ప్యూడల్‌ నిరంకుశత్వం పట్ల, పితృస్వామ్య అహంకారం పట్ల, పురుషాధిపత్యం పట్ల, మతం పట్ల, కులం పట్ల, ధనస్వామ్యం పట్ల అసహ్యాన్నీ, వ్యతిరేకతనూ రగిలించడం కూడా ఆయన రచనాదర్శం. ఆయనకు ఈ ఆశయానికీ, ఆదర్శానికీ దోహదం చేసింది ఆయనకున్న మార్క్సిస్టు దృక్పథం. ఈ దృక్పథం వల్లనే ఆయన అగ్రశ్రేణి కథా రచయితగా నిలబడగలిగినాడు.

స్త్రీలను గౌరవించే సమాజాన్ని ఆయన కథలు ఆకాంక్షిస్తాయి. స్త్రీల పట్ల పురుషుడికుండే కుసంస్కారాన్ని ఆయన కథలు ఎండగడ్తాయి. ఆయన కథల్లో ఆడవాళ్ళు ధైర్యంగా పరిస్ధితుల్ని ఎదుర్కొంటారు. వేదాంతం వల్లించే మగవాళ్ళ పక్షానగాకుండా, శ్రమలో జీవించే ఆడవాళ్ళ పక్షాన నిలుస్తాడు. అంతేకాదు శ్రామికవర్గం పట్ల పక్షపాత వైఖరి ఆయన కథల్లో ప్రధానంగా కన్పిస్తుంది. పీడనకూ, దోపిడీకి, వంచనకూ గురయ్యే పేదలు ఆయన కథల్లో కన్పిస్తారు.

కేతు విశ్వనాథరెడ్డి కథలన్నీ సామాజిక స్వభావం పట్ల, అంతరాల పట్ల, మనుషుల ప్రవర్తన వెనుక దాగున్న సాంఘీక సూత్రాల పట్ల ఒక కొత్త స్పృహను కలిగిస్తాయి. పాఠకుడిని సామాజిక వినయశీలిని చేస్తాయి. ప్రతి కథా ఒక లక్ష్యంతో నడుస్తుంది. తళతళలూ, మెరుపులూ, ఉత్కంఠలూ ఏ కథలోనూ ఉండవు. మనల్ని మనం 'చెక్‌' చేసుకోవడానికీ, మరింత ఉన్నతంగా ఎదగడానికీ ఈ కథలు ఉపకరిస్తాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good