ఇప్పుడే రాయడం మొదలెట్టిన కవికైనా, ఇప్పటికే దశాబ్దాల రచనా ప్రయాణం చేసిన కవికైనా, స్వీయ సమీక్ష అవసరమే. తాను ఆవిష్కరించదలచుకున్న దృశ్యానికీ లేదా ఆలోచనకూ, ఆవిష్కరించిన శబ్దరూపమిచ్చే అర్ధానికీ నడుమ అన్వయముందా అని చూసుకోవడం అత్యవసరమే. దిద్దుబాట్లు ఆవశ్యకమే. రచి తరచి చూసుకుంటే చేయాల్సిన మార్పులేంటో తెలుస్తాయి. ఇంకా కొంత సృజనశక్తిని రచనకివ్వాల్సిన అవసరముందా అనే విషయం అర్ధమవుతుంది.

పరికరాలు లేకుండా ఏ నిర్మాణమూ జరగదు. కవితా నిర్మాణానికి కవి ఉపయోగించే పరికరాలు తుప్పుపట్టకుండా, మొండిపోకుండా చూసుకోవాలని ప్రత్యేకంగా చెప్పాలా? పరికరాల్ని ఎప్పటికప్పుడు సానపట్టుకుంటేనే నిర్మాణంలో నైపుణ్యాన్ని రాబట్టొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా, శ్రద్ధతో, ప్రేమతో, మమకారంతో కవిత్వాన్ని చదువుకునే పాఠకులున్నారనే సత్యాన్ని ఏ కవైనా సదా గుర్తు పెట్టుకోవడం మంచిది. ఆ ఎరుకలో కవి తప్పక స్వీయ సమీక్షను అవసరంగా స్వీకరిస్తాడు. -దర్భశయనం శ్రీనివాసాచార్య

Write a review

Note: HTML is not translated!
Bad           Good